ప్రథమ పౌరునిగా అత్యుత్తమ సేవలందిస్తా..

దేశ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేస్తా
ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రథమ పౌరునిగా ప్రజలకు అత్యుత్తమ సేవలందిస్తానని చెప్పారు. దేశ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు విలేకరులతో మాట్లాడారు. తనకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన సంగ్మాకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తన విజయానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ప్రజలు తనకు డిస్టింక్షన్‌ ఇచ్చారని సంతోషం వెలిబుచ్చారు. ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్‌లోని బిర్బమ్‌ జిల్లా మీరట్‌ వాసులు పండుగ జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ గ్రామం ప్రణబ్‌ సొంత ఊరు.