ప్రభుత్వానికి ముందు చూపు లేదు: వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రైతు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి సమస్యల పట్ల ముందు చూపు లేదని వైఎస్సార్‌ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ విమర్శించారు. గత మూడు రోజులగా ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె గురువారంనాడు ఒక తెలుగు న్యూస్‌ ఛానెల్‌ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె అన్నారు. రైతులకు కావాల్సినంత ఎరువులు దొరకడం లేదన్నారు. తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకం కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అమలు పర్చడం లేదన్నారు. పాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ముందు చూపు లేదని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమస్యలపై ముందే ప్లాన్‌ చేసుకునే వారన్నారు. విత్తనాలు, విద్యుత్‌ ఎలాంటి సమస్యనైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకునే వారన్నారు. అందుకే ఆయన రైతుల విశ్వాసం చూరగొన్నారన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి ప్రణాళిక లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రైతుల కోసమంటూ అవిశ్వాసం పెడితేనే తమ పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. రైతుల కోసమే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు.తమంతట తాము కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోమని చెప్పారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదని చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తమ పార్టీ ఘన విజయం సాధించడంతో పలు జాతీయ పార్టీలు తమ వైపు చూస్తున్నాయని చెప్పారు. తమ విజ్ఞప్తులు విన్న నేతలకు కృతజ్ఞతలు అని అన్నారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పైన కక్ష సాధింపుతో సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు. రైతుల అంశంతో పాటు ఢిల్లీ పెద్దల దృష్టికి తన తనయుడుపై జరుగుతున్న కుట్రను కూడా తీసుకెళ్ళానని తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, జెడి(యు) తదితర పార్టీల నేతలను కలిసినట్లు ఆమె చెప్పారు.