ప్రమాదంగా మారిన డ్రైనేజీ

యర్రగొండపాలెం ,జూలై 24,: షెడ్యుల్డ్‌ కులాలు, వెనుకబడిన కులాల విద్యార్ధినిలకు ఆశ్రయం ఇస్తున్న యర్రగొండపాలెం ఎస్సీ బాలికల వసతిగృహం చుట్టు నెలలతరబడి పేరుకుపోయిన డ్రైనేజీ, ఉప్పునీరు వారి ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కెవివి ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు వైపాలెంలో ఎస్సీ బాలికల వసతిగృహాన్ని స్థానిక సిపిఐ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. హాస్టల్‌ చుట్టు ఉన్న డ్రైనేజీ మురికి నీటిని తరలించడంలో మండల స్థాయి అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. పట్టణంలోని మురికినీరు హాస్టల్‌ చుట్టు నిలిచిపోయి దోమలకు నిలయంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వసతిగృహంలోని బాలికలు నిద్రలేక ఆహార పదార్థాలు లుషితంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ఒకపక్క మురికినీరు, మరోపక్క దోమల బాధతో బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ మురుగునీటిని వెంటనే తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వసతిగృహంలో మండల స్థాయి అధికారులు రెండు రోజులు నివసిస్తే విద్యార్ధినిల బాధలు వారికి అర్దం అవుతాయని ఆయన ఆరోపించారు. ఆయన వెంట సిపిఐ నాయకులు టిసిహెచ్‌ చెన్నయ్య, కెవి కృష్ణగౌడ్‌, గురునాధం, టి వెంకటేశ్వర్లు, డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.