ప్రసార ‘ఉగ్రవాదం’ పెరిగిపోతున్నది !

ఉగ్రవాదం అంటే.. బాంబులను విసురుతూ, తూటాలు పేల్చుతూ, సాటి మానవులను పైశాచికంగా, ప్రత్యక్షంగా హింసించడమే అని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి ఇదే నిజం కావచ్చు. కానీ, ప్రస్తుత కాలంలో ఉగ్రవాదంలో రకాలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్పుకుంటే, సమాజంలోని ఒక వర్గంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తూ, మరో వర్గాన్ని సదరు బడుగు వర్గానికి వ్యతిరేకంగా తయారు చేయడం ఓ రకం ఉగ్రవాదం. ఇది సాధారణంగా రాజకీయాల్లో, ముఖ్యంగా మతతత్వ పార్టీల్లో అధికంగా కనబడుతుంది. తమ అభిప్రాయాలను బలవంతంగా ప్రజలపై రుద్ది, ఆ దిక్కుమాలిన అభిప్రాయమే సరైనదని నిరూపించే ప్రయత్నం చేయడం కూడా ఉగ్రవాద రకాల్లో రెండోది. ఈ టైపు మూర్ఖత్వం రాజకీయాలతోపాటు కార్పొరేట్‌ సంస్థల్లోనూ అధికంగా కనబడుతుంది. మరో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదం కూడా ీ్ణఈ మధ్య కాలంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. ఈ ఉగ్రవాదం నిత్యం టీవీలున్న, పత్రికలు వచ్చే ప్రతి ఇంటికి తన పైశాచికత్వాన్ని ‘ప్రసారం’ చేస్తున్నది. మీరు చదివింది.. చదవబోతున్నది నిజమే. ఈ రకం ఉగ్రవాదాన్ని మీడియా అనే ప్రసార మాధ్యమాలు పెంచి పోషిస్తున్నాయి. అవి ఛానళ్లు కావచ్చు, పత్రికలు కావచ్చు. తమకు నచ్చని వర్గంపై ఓ నాయకుడో, ఓ కాలమిస్తో తన గళాన్ని కొంచెం వినిపించినా చాలు. ఆ విషయాన్ని గోరంతలు కొండింతలు చేసి చూపించడం చేస్తున్నాయి. ఫలితంగా, వీళ్ల ఛానళ్ల రేటింగులో లేక పత్రికల సర్క్యులేషన్లు పెంచుకోవడమే ఈ మీడియాధిపతులు ప్రధాన లక్ష్యం. అంతేగానీ, తమ వార్తల ప్రసారంతో సమాజంలోని ఓ బలహీన వర్గం బలమైన వర్గాల చేతిలో ఆకృత్యాలకు గురయ్యే ప్రమాదముందన్న ఇంగిత జ్ఞానపు ఆలోచన కూడా వీళ్లకు రాదు. గతంలో హైదరాబాద్‌లోని మక్కా మసీదులో పేలుళ్లు జరిగినప్పుడు, ఓ ఛానల్‌ వేరే వార్తను కవర్‌ చేయడానికి వెళ్లి, బాంబు విస్ఫోటనాన్ని దృశ్యమాలికగా అందించింది. అంతేకాకుండా, ఆ బాంబు దాడికి ఓ వర్గానికి చెందిన హైదరాబాదీ యువకుల కారణమని, ఎక్కడో ట్రెయినింగ్‌ తీసుకుని, మక్కా మసీదులో ట్రయల్స్‌ చేశారని, ఉన్నవీ లేనివీ కల్పించి కథలు కథలుగా ప్రసారం చేసింది. ఈ ప్రసారపు తీవ్రత పోలీసుల దర్యాప్తును కూడా ప్రభావితం చేసింది. దీంతో పోలీసులు సదరు ఛానల్‌లో ప్రసారమైన వార్తను బట్టి అభం శభం తెలియని వందల మంది ఆ మైనార్టీ వర్గానికి చెందిన యువకులను పట్టుకెళ్లి థర్డ్‌ డిగ్రీలు ప్రయోగించి మరీ విచారించారు. కానీ, పోలీసులకు దొరికిన ఆధారాలు శూన్యం. ఆ సమయంలో మంత్రిగా ఉన్న షబ్బీర్‌ అలీ ఆ బాధిత యువకుల్లో కొందరిని విడిపించేందుకు ప్రయత్నిస్తే మరో పత్రిక ‘షబ్బీర్‌ అలి.. భద్రత బలి’ అన్న శీర్షికతో సదరు మైనార్టీ వర్గానికి వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది. సదరు మైనార్టీ వర్గాన్ని ఉగ్రవాదులుగా ముద్ర వేయించడానికి ఆ కథనం రాష్ట్రంలో తన శాయశక్తులా కృషి చేసింది. మరి అదే మక్కా మసీదు పేలుడు విచారణ పూర్తయ్యాక నిందితులుగా తేలింది మెజార్టీ వర్గానికి చెందిన సంస్థ సభ్యులే. వారు అభినవ భారతి సంస్థకు చెందిన సన్యాసిని ప్రజ్ఞా సాధ్వి అనే యువతి మొత్తం పేలుళ్లకు కుట్ర చేసిందని విచారణలో వెల్లడైంది. కానీ, ఆ సమయంలో ఏ ప్రసార మాధ్యమం కూడా ఆ మెజార్టీ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఒక్క కథనాన్ని కూడా వెలువరించలేదు. ఇది మైనార్టీలపై కక్ష కాదా ? ముమ్మాటికీ అదే. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ ఖాన్‌ అంటే తెలియని వారుండరు. మన దేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్‌లో ఈ అభిమానుల సంఖ్య కొంచెం అధికం. అలాంటిది షారూఖ్‌ ఖాన్‌ ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్తే, ఆయనకు అక్కడ ఘోర అవమానం జరిగింది. కారణం ఒక్కటే. ఆయన పేరు ‘షారూఖ్‌ ఖాన్‌’ కావడమే. ఇంతకు ముందు ఇలాంటి అనుభవమే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు కూడా ఎదురైంది. ఇక్కడ కూడా కారణం పేరే. ప్రపంచ వ్యాప్తంగా సదరు బలహీన వర్గాన్ని ఉగ్రవాదులుగా ముద్ర వేయాలని కొందరు మూర్ఖ పాలకులు భావిస్తుంటే, మీడియా కూడా లేనిపోని కల్పిత కథలన్నీ రంగరించి, వాటికి మసాల దట్టించి ఆ వర్గాన్ని అణగదొక్కడంలో భాగంగా అగ్నికి ఆజ్యం పోస్తున్నది. ఇప్పటికైనా మీడియా తన ‘అతి’ని వీడాలి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సమాజంలోని సమస్యలను పరిష్కరించాల్సిన మీడియా, సమాజం మరింత కుళ్లిపోయేలా, తమ స్వార్థం కోసం పని చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే ప్రజలకు అన్ని వ్యవస్థలపై నమ్మకం పోయింది. అంతో ఇంతో మీడియానే నమ్ముతున్నారు. మీడియా తన వైఖరిని మార్చుకోకుంటే, ప్రజలు దాన్ని కూడా పక్కనబెట్టి ప్రత్యక్ష ఉద్యమాలకు దిగినా దిగవచ్చు. ఎందుకంటే, చరిత్ర పుటలను తిరగేస్తే కనబడేది ఇదే కదా !