ప్రాజెక్టులన్నిటినీ సత్వరం పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాము: సుదర్శనరెడ్డి
హైదరాబాద్: జలయజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించి రైతులను ఆదుకొంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి సదర్శనరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులన్నిటినీ సత్వరం పూర్తిచేసేందుకు యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో కొన్నింటిని వచ్చే ఖరీఫ్‌కు, మిగిలిన వాటిని 2014 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించామన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సుదర్శనరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యమిచ్చిందని, అనేక ప్రాజెక్టులు ఇప్పటికే ఓ దశకు చేరాయని పేర్కొన్నారు. ప్రాధాన్య విభాగంలోకి చేర్చిన 50 ప్రాజెక్టుల్లో వచ్చే ఖరీఫ్ నాటికి 25ను, 2I14 ఖరీఫ్ నాటికి 21ని, మిగిలిన ప్రాజెక్టులను తర్వాత ఖరీఫ్‌కు పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన కరెంటును ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దశలవారీగా ప్రజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. ఈ మేరకు అవసరమైన విద్యుత్తు సరఫరా చేయడానికి విద్యుత్తు శాఖ అంగీకరించిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే 2వేల మెగావాట్ల జల విద్యుత్తుకు అవకాశమేర్పడుతుందని వెల్లడించారు.



