
వడ్డేపల్లి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని రవీంద్ర ఉన్నత పాఠశాల విషయంలో కీలక పరిణామం. పాఠశాలను రక్షించుకునేందుకు పూర్వ విద్యార్థులంతా ఏకం కావడం, దేశవిదేశాల్లో ఉన్న ఆనాటి విద్యార్థులంతా సేవ్ ఆర్హెచఎస్ కోసం ముందుకు కదలడంతో స్కూల్ యాజమాన్య కమిటీ సానుకూలంగా స్పందించింది. పాఠశాల స్థలం, భవనాలు సర్కారు పరిధిలోకి ఇవ్వడానికి కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. రేపు పాఠశాలలో సమావేశం జరిపి తీర్మానం చేసేందుకు నిర్ణయించారు. ఈ ప్రకటన వెలువడగానే పూర్వ విద్యార్థుల్లో భావోద్వేగాలు ఉప్పొంగాయి. స్కూలు కమిటీ సహకరించడం గొప్ప విషయమని హర్షం వ్యక్తమవుతోంది. స్కూలు జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియా (వాట్సప్) వేదికగా ఒక్కొక్కరుగా గొంతు కలపడంతో సేవ్ ఆర్హెచఎస్ ఉద్యమం నలుదిశలా వ్యాపించింది. ఈ క్రమంలో స్కూల్ కమిటీ సానుకూలంగా స్పందించింది. అయినప్పటికీ స్థలం, భవనం ప్రభుత్వ స్వాధీనం అయ్యేదాకా విశ్రమించకుండా ఉద్యమించాలని పూర్వ విద్యార్థులు సంకల్పంతో ఉండటం గమనార్హం.