ప్రారంభమైన ఉద్యోగుల క్రీడలు

కర్నూలు, ఆగస్టు 3 : ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల క్రీడలను శుక్రవారం కలెక్టరేట్‌లోని షటిల్‌ కోర్టులో జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథం ఉద్యోగులు ఎక్కువ పని ఒత్తిడికి గురవుతున్నారని, క్రీడలు వారికి మానసిక ఉల్లాసంతో పాటు కార్యాలయ పనుల్లో కూడా ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. 40 సంవత్సరాల తర్వాత మానవ శరీరంలో కొన్ని సమస్యలు వస్తుంటాయని రోజు శరీర వ్యాయమం, క్రీడల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొవడమే కాకుండా ఇంటి పనులు, ఆఫీసు పనులు చేసుకోవడానికి శరీరం అలసట లేకుండా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య, ఆహార విషయాలపై దృష్టి పెడితే జీవించినంత కాలం అనారోగ్యానికి గురికాకుండా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.కె.పి, డి.ఆర్‌.డి.ఎ, పిడి సోనీబాలదేవి, ఎ.పి.డి వెంకటేశ్వర్లు, ఐ.కె.పి, డి.ఆర్‌.డి.ఎ పరిపాలనాధికారులు శ్రీనివాసులు, రామచంద్రరావు, స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌ మల్లికార్జున, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి, క్రీడల రెఫరీ సంపత్‌ కుమార్‌, కోచ్‌ భీముడు క్రీడల్లో పాల్గొన్నారు. అదే విధంగా ఐ.కె.పి. డి.ఆర్‌.డి.ఎ మహిళ, పురుష ఉద్యోగులు కలిసి కబడ్డీ, చెస్‌, షటీల్‌, టెన్నీకాయిట్‌, రన్నింగ్‌ క్విజ్‌, మ్యూజికల్‌ చైర్స్‌, క్యారమ్స్‌, క్రికెట్‌ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐ.కె.పి, డి.ఆర్‌.డి.ఎ, ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని, పని ఒత్తిడికి తగ్గించుకోవడానికి ఈ క్రీడలు ఉద్యోగులకు ఉపయోగపడుతాయన్నారు. అందరూ ఈ క్రీడల్లోని పాల్గొని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆమె కోరారు.