‘ప్రేమ్‌సాగర్‌తో పార్టీకి తీవ్ర నష్టం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఇతర నియోజకవర్గాల్లో తల దూర్చడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టుపడుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. ఎంతో మంది నాయకులు కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణతో మెలుగుతున్నారని ఇందుకు భిన్నంగా ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగరరావు వ్యవహరించడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో ఎమ్మెల్సీ తలదూర్చడం వల్ల నామినెట్‌ పదువుల్లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు కాకుండా పార్టీలు మారీ పార్టీకి ఎలాంటి సేవలు అందించని వారిని నామినెట్‌ పదవులు ఇవ్వడం వల్ల నాయకులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఎమ్మెల్సీ చేస్తున్న గ్రూప్‌ రాజకీయాల వల్ల కాంగ్రెస్‌ పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర నాయకులకు ఫిర్యాదు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. సిద్దాంతాల కోసం పాటుపడే నాయకులకు, కార్యకర్తలను కాదని డబ్బుతో రాజకీయాలు నడిపే ప్రేమ్‌సాగరరావు చర్యలను అడ్డుకుంటామని అవసరమైతే కార్యకర్తలతో పోరాటానికి సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగరరావు తన విధానాన్ని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.