ఫలితాలతో కాంగ్రెస్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా 15 స్థానాల్లో గెలుపొందడం పట్ల జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు నిర్వహించారు. తపాసులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుతూ సాయిరెడ్డి అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కుట్రలు, కుంతంత్రాలు చేసినా ప్రజలు జగన్‌ వెంటే ఉన్నారని, ఫలితాలతో నిరూపితమైందని పేర్కొన్నారు. పరకాల ఉప ఎన్నికల్లో నైతిక విజయం తమ పార్టీదేనని అన్నారు. రాబోయే 2014 సాధారణ ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ త్వరలో జైలు నుంచి వస్తారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు ప్రభుత్వాలకు చెంపపెట్టని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు రతన్‌, హరికృష్ణ, తదితరులున్నారు.