ఫీజు రీయింబర్స్‌ మెంట్‌పై చర్చకు కాంగ్రెస్‌ పట్టు

– బీఏసీలో నిర్ణయాల ప్రకారమే సభ నడుస్తుందన్న హరీష్‌రావు

– సభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

– కాంగ్రెస్‌ తీరుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి)

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. సోమవారం ఉదయం సభ మొదలవగానే డిప్యూటీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టగా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి పట్టుబట్టారు. కాగా ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నామని, అసెంబ్లీ నియమాలను ఉల్లంఘించవద్దని మంత్రి హరీష్‌రావు తెలిపారు. దీనిపై జానా మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే అని అయితే అత్యవసరమైన విషయానికి సంబంధించి సభలో చర్చించాలని కూడా తాము బీఏసీలో చెప్పామని దీనిపై ప్రభుత్వ స్పందనకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు జానా తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే వాకౌట్‌ అనడం సబబు కాదని, అనుభవం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇలా వ్యవహరించడం తగదన్నారు. అసలు ప్రతిపక్షం సభలో ఉండటం కన్నా బయటకు వెళ్లేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సందర్భంగా గ్రెస్‌ పార్టీపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ విరుచుకుపడ్డారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ కావాలనే రచ్చ చేస్తోందని ఆయన అన్నారు. ప్రతి సెషన్‌కు కాంగ్రెస్‌ మాటమార్చడం తగదని అక్బరుద్దీన్‌ హితవు పలికారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అతిక్రమించవద్దని, సభను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా కాంగ్రెస్‌ వ్యవహరించాలన్నారు.

తాజావార్తలు