బకాయిల కోసం విజయ్‌ మాల్యా ఆస్తుల వేలం బ్యాంకుల కన్సార్షియం

కాదు.. మేమే అమ్మకానికి పెట్టాం : కింగ్‌ ఫిషర్‌
ముంబై, జూలై 6 (జనంసాక్షి): కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసిన రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యజమాని, లిక్కర్‌ సామ్రాట్‌ విజయ్‌ మాల్య అధీనంలోని స్థిరాస్తులను వేలం వేసేందుకు ప్రణాళికలు రూపొందించాయి. ఇందులో భాగంగా ముంబైలోని కింగ్‌ఫిషర్‌ హౌస్‌, గోవాలోని విజయ మాల్య విలాస విడిదిని వేలం రూపంలో విక్రయించేందుకు బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఈ ఆస్తుల విక్రయం ద్వారా బ్యాంకులు రూ.120 కోట్లు వరకు వసూలు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం 17 బ్యాంకుల కన్సార్షియం హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీని నియమించి ఈ రెండు ఆస్తుల విలువ కట్టామని తెలిపింది. ఈ 17 బ్యాంకులు కలిసి కింగ్‌ఫిషర్‌కు మొత్తం రూ.7,500 కోట్లు వరకు రుణాలిచ్చాయి. ఎస్‌బిఐకు రూ.1,400 కోట్లు, పిఎన్‌బిఐకి రూ.700 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రూ.500 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంకుకు రూ.430 కోట్లు వరకుకింగ్‌ ఫిషర్‌ సంస్థ బకాయి పడింది. గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని విక్రయించుకొని మీ డబ్బు వసూలు చేసుకోవాల్సిందిగా తాము బ్యాంకులకు గురువారం ఎస్‌బిఐ సమక్షంలో జరిగిన సమావేశంలో సూచించామని కింగ్‌ ఫిషర్‌ తెలిపింది. అయితే బ్యాంకులు మాత్రం శుక్రవారంనాడు జరిగిన ఈ సమావేశంలో కింగ్‌ఫిషర్‌ ఈ ప్రాస్తావన తెలేదని పేర్కొంది. ఈ రెండు ఆస్తులకు కింగ్‌ఫిషర్‌ ఛైర్మన్‌ విజయ్‌ మాల్యా స్వంత పూచీకత్తు కూడా ఇచ్చారని 2010 నవంబర్‌ నుంచి బ్యాంకుల వద్ద ఈ రెండు ఆస్తులను తనఖా పెట్టారని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఐతే పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, 15 రోజుల సమయం మిగిలే ఉందని గుర్తు చేశాయి. తమ రుణాన్ని రాబట్టుకునేందుకు బ్యాంకులు కింగ్‌ఫిషర్‌ ఆస్తులను విక్రయిస్తున్నారన్న విషయాన్ని కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తోసిపుచ్చింది. ఈ రెండు ఆస్తులను ఎప్పుడో తాము అమ్మకానికి పెట్టామని తెలిపింది. ముంబయిలోని కింగ్‌ఫిషర్‌ హౌస్‌, గోవాలోని ఒక విల్ల్లాను బ్యాంకులకు కొన్ని నెలల క్రితమే కుదవ పెట్టింది. బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం ప్రకారం ముంబయిలోని శివార్లలో ఉన్న కింగ్‌ఫిషర్‌ హౌస్‌ విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, గోవాలోని విల్ల్లా ఖరీదు రూ.30 కోట్లు ఉంటుందని తెలిపింది. ముంబయిలోని కింగ్‌ఫిషర్‌ హౌస్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇక్కడి సిబ్బంది క్యూబే అనే ప్రాంతంలోని కొత్త కార్యాలయానిదకి మారారు. రెండేళ్ల క్రితం వర కు దేశీయ విమానయాన రంగంలో ద్వితీయ స్థానంలో దూసుకుపోయిన కింగ్‌ఫిషర్‌ ఇప్పుడు అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు బ్యాంకర్ల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతోంది.