బిజెపికి వరంగా కాంగ్రెస్‌ వైఫల్యాలు 

మరింత మంది చేరికలకు రంగం సిద్దం
హైదరాబాద్‌,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ వైఫల్యాలను బిజెపి బాగా ఉపయోగించు కుంటోంది. ఆ పార్టీ కుటుంబ పాలనను బాగా ప్రొజెక్ట్‌ చేస్తూ వచ్చిన బిజెపి మంచి ఫలితాలను రాబడుతోంది. గతంలో నెహ్రూ,ఇందిర కటుంబాలను ఆదరించిన ప్రజలు కాలక్రమంలో వారసత్వ రాజకీయాలను దూరం పెడుతున్నారు. ఈ పరిణామం అన్ని పార్టీలకు కనువిప్పు కావాలి. యూపి, కాశ్మీర్‌, బీహార్‌, తెలంగాణ తదితర ప్రాంతాల్లో బిజెపి బలంగా మారడానికి వారసత్వ రాజకీయాలే కారణంగా చూడాలి. తాజా పరిణామాలల్లో బిజెపి ఎదగడానికి కూడా వారసత్వ రాజకీయాలనే ప్రస్తావించాలి. బిజెపి బలం ఇంతగా పెరగడానికి కారణాలు చూస్తేమొదటి కారణం కాంగ్రెస్‌ బలహీనపడడం కూడా కారణంగా చెప్పుకోవాలి.  ఆస్సాం, బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా,  హర్యానా, తమిళనాడు, ఎపి, తెలంగాణ, కర్ణాటక ఇలా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనపడ్డ పరిస్థితి చూస్తున్నాం. సరైన నాయతక్వం లేకపోవడం  కూడా కాంగ్రెస్‌ బలహీనపడేందుకు అవకాశంగా మారింది. టిఆర్‌ఎస్‌ కూడా తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ గనక బిజెపి పట్ల కొంత మెతక వైఖరితో ఇంతకాలం ఉంటూ వచ్చింది. దానికి తోడ్పాటు కూడా అందించిన రోజులున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్నప్పుడు కూడా కెసిఆర్‌ కాంగ్రెస్‌, బిజెపి రెంటినీ వ్యతిరేకిస్తానన్నారు. ఇప్పుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల ముంగిట్లోనే బిజెపి విధానాలకు వ్యతిరేకంగా జాతీయ వేదిక అన్నారు గాని అప్పటికే  జరగాల్సిన నష్టం జరిగింది. దీనికి తోడు పాలనా పరమైన తప్పొప్పులు, హైదరాబాద్‌లో పౌర సమస్యలు, ఇటీవలి వరద పాట్లు వంటివి తోడైనాయి. దుబ్బాకలో  కొద్దిపాటి మెజార్టితో గెలిచిన బిజెపిని హైదరాబాద్‌లో ఏకైక ప్రత్యామ్నాయంగా ఇంకా చెప్పాలంటే కాబోయే విజేతగా ప్రజల్లో బలంగా వెళ్లేలా చేసింది. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ ఎంపి ధర్మపురి అర్వింద్‌ వంటివారి దూకుడును కూడా ప్రజలు స్వాగతించారు. మజ్లిస్‌ తమ ప్రధాన ప్రత్యర్తి అని చెప్పినా రాజకీయ వాస్తవాలను బట్టి ఎవరూ తీవ్రంగా విశ్వసించలేదు. కాంగ్రెస్‌, టిడిపిల అంతర్ధానం కూడా బిజెపికి కలసి వచ్చింది. కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలతో తనను తానే వెన్నుపోటు పొడుచుకుంది. మొన్నటి బీహార్‌ ఎన్నికల్లో దాని ప్రభావం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ బలహీన పడడం వలన ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని కూడా బిజెపి ఉపయోగించు కోగలిగింది. . దక్షిణ భారతంలో బలపడాలన్న బిజెపి ..తమ తాజా వ్యూహాలకు  హైదరాబాద్‌ ఫలితాలను చూపించే ప్రయత్నం పెద్ద ఎత్తునే జరుగుతుంది.  ఈ క్రమంలో ఇకముందు కూడా బిజెపి మాత్రం దూకుడు పెంచడమే తగప్ప తగ్గడం వుండదు. ఇకపోతే కాంగ్రెస్‌ కేవలం రెండుసీట్లు గెలవడం, దుబ్బాకలో డిపాజిట్‌ కోల్పోవడంతో  కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణంగా వుంది గనక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయవలసి వచ్చింది. అంతేనా అంటే ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి అనేకులు బిజెపిలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందులో భాగంగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి లాంటి వారు చేరే అవకాశాలు ఉన్నాయి.