బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని చెల్లించాలి

కర్నూలు, జూలై 31 : రుణ అర్హత కార్డులుండి రుణం తీసుకున్న కౌలు రైతులు వారి రుణాన్ని బ్యాంకుల వారికి కట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సునయన ఆడిటోరియంలో రుణ అర్హత కార్డుల, పంట రుణాల, మాగుడి తదితర అంశాలపై బ్యాంకర్లు, ఆర్‌డిఓలు, ఎమ్మార్వోలు, ఎంపిడిఓలతో, వ్యవసాయాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం రుణ అర్హత కార్డుల కొరకు 23.860 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 19.224 లకు అర్హత ఉందని, వారికి ఇంతవరకు దాదాపు రూ.36 కోట్లు రుణంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం కూడా రుణ అర్హత కార్డుల కొరకు దరఖాస్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలించి అర్హతలను చూసి మంజూరు చేయాలని అన్నారు. గతంలో రైతులు తీసుకున్న రుణ అర్హత కార్డులు చాలా రెన్యూవల్‌ కాలేదని ఎందుచేత రెన్యూవల్‌ చేసుకోలేదో వివరాలు తెలుసుకోవాలని ఎమ్మార్వోలు, ఎంపిడిఓలను ఆదేశించారు. అలాగే తీసుకున్న రుణాలను పూర్తిగా తిరిగి బ్యాంకుకు కట్టించే విధంగా రైతులకు అధికారులు తెలియచెప్పాలన్నారు. పంట రుణాలలో చాలామంది ప్రజలు రుణాలు బ్యాంకుకు కట్టడం లేదని, అలాగే వారి జాబితాలో డిఫాల్ట్‌లు ఉన్నాయని వాటిని ఆర్‌డిఓలు ఆయా బ్యాంకులకు జాబితాలను పంపి పంట రుణాల రికవరీ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎజెపి రామస్వామి, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ జెడి ఠాగూర్‌నాయక్‌, ఎల్డియం అండావర్‌, బ్యాంకు అధికారులు, ఆర్డిఓలు, ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, వ్యవసాయ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.