బ్రహ్మండం బద్దలవ్వాలె

కేంద్రం దిగిరావాలె

తెలంగాణ ఇవ్వాలె

పటిష్ట ఉద్యమానికి కార్యాచరణ

రాష్ట్రపతి ఎన్నికల్లో మన ఆకాంక్ష కనబడాలె
హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి):
బ్రహ్మాండం బద్ధలయ్యేలా తుది విడత తెలంగాణ ఉద్యమం ఉంటుందని తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. మంగళవారం టీఎన్‌జీవో భవన్‌లో కోదండరాం అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉ ద్యమ దాటికి దీంతో కేంద్రం దిగి రాక తప్పదన్నారు. ఈ ఉద్యమాన్ని మహా ఉద్యమంగా చేపట్టి కేంద్రం మెడలు వంచుతామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం తప్ప కేంద్రానికి మరోమార్గం లేదన్నారు. అంతిమ లక్ష్యం సాధించే వరకూ ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను కేంద్రం ఇచ్చితీరాల్సిందేన న్నారు.తెలంగాణ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేసేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించనున్నట్టు ఉద్యమ ఉధృతికి పటిష్టమైన కార్యాచరణ తయారు కోసం ఈనెలాఖరులోగా టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో ఉద్యమ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ ఖరారు చేస్తా మన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకుకృషి చేస్తామని కోదండరాం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ ఆకాంక్షను వ్యక్తంచేసే వేదికగా ఉపయోగిం చుకుంటామని కోదండరాం తెలిపారు. దీనికోసం అవసరమైతే ఓ ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు ఆలోచిస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అభ్యర్థికే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనెల 21న తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపెల్లి జయశంకర్‌ వర్థంతిని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆ మహనీయుని వర్ధంతి కార్యక్రమాల్లో జేఏసీ శ్రేణులతోపాటు తెలంగాణవాదులు, ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక,విద్యార్థి నాయకులంతా పాల్గొనాలని కోదండరాం కోరారు.