బ్రాహ్మణులకు మద్దతిస్తే బెదిరిస్తున్నారు : జొన్నవిత్తుల

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ చిత్ర వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమా వివాదంపై బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడినందుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్‌రావు వెల్లడించారు. సినిమాలో ఉన్న వివాదాస్పద అంశాలను ప్రశ్నించడం వల్లే తనను చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక జాతికి జరిగిన అవమానంపై తాను గళం విప్పానే తప్ప ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలతో కాదని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సినిమాలో బ్రాహ్మణ మహిళలను కించపరచేలా ఉన్న సంభాషణల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చిత్ర నిర్మాత మోహన్‌బాబు స్పందించాలని డిమాండ్‌చేశారు.