భోగిమంటల్లో నల్లచట్టాలు
– రైతుల నిరసన హోరు
దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జరుపుకొనే పాడిపంటల పండగ మకర సంక్రాంతిని కూడా రైతులు తమ నిరసనను తెలిపేందుకు అవకాశంగా మలుచుకున్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు లోరీ పండుగ సందర్భంగా వినూత్నంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర భారతదేశంలో సంక్రాంతిని లోరీ, బిహూ, పొకి పేరిట జరుపుకొంటారు. ఈ పండగలో భాగంగా వేసే మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేసి నిరసన తెలపనున్నామని పేర్కొన్నారు. ఈ రకంగా బుధవారం సాయంత్రం తమ లోరీ వేడుకలు జరగనున్నాయని రైతు సంఘాల నేతలు తెలిపారు. మరోవైపు 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా మధ్యాహ్నం భేటీ కానుంది. తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణను నిర్ణయించనుంది.సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతిఒక్కరూ కమిటీకి తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. అయితే, రైతుల సంఘాలు మాత్రం అందుకు సుముఖంగా లేవు. చట్టాల రద్దు తప్ప తమకు ఇంకే పరిష్కారం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాయి. చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపాయి. కోర్టు ఏర్పాటు చేసిన కమిటీపైనా రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీలోని సభ్యులంతా గతంలో చట్టాలపై సానుకూలంగా మాట్లాడినవారేనని పేర్కొన్నారు.