భ్రష్టుపట్టిన వ్యవస్థలో ఇతనో పరాకాష్ట

మాజీ జడ్జి పట్టాభి అరెస్టు
సుధీర్ఘంగా వాయించిన సీబీఐ
రిమాండ్‌ కు తరలింపు
హైదరాబాద్‌, జూన్‌ 19 : ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంలో ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై సీబీఐ రెండో అదనపు కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావును మంగళవారంనాడు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఎదుట ఆయన్ను హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల పాటు జ్యూడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా తనను స్పెషల్‌ కేటగిరి నిందితునిగా గుర్తించాలని పట్టాభి పిటిషన్‌ దాఖలు చేశారు. పట్టాభి అరెస్టు క్రమం ఇలా కొనసాగింది. మంగళవారం ఉదయం పట్టాభిని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలించారు. నిమ్స్‌ డైరెక్టర్‌, వైద్యులు ఏసీబీ కార్యాలయానికి వచ్చి పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఇదిలా ఉండగా ఓఎంసీ కేసులో గాలికి బెయిల్‌ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు చేతులుమారాయని సీబీఐ పక్కా ఆధారాలు చూపించి కేసు నమోదు చేసింది.ఇందుకు సంబంధించి హైకోర్టులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి మదన్‌ బి లోకూర్‌కు వివరాలు అందించడంతో ఆయనను పొలిజీయం సలహా మేరకు పట్టాభిని సస్పెండ్‌ చేశారు. అవినీతికి సంబంధించిన కేసు అయినందున సీబీఐ దీనిని ఏసీబీకి అప్పజెప్పింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులపై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఇప్పటికే మధ్యవర్థులుగా వ్యవహరించిన మాజీన్యాయమూర్తి చలపతిరావు, పట్టాభికుమారుడు రవిచంద్రను అరెస్టు చేసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో మధ్యవర్థి యాదగిరిరావు,న్యాయవాది ఆధిత్యల కోసం ఏసీబీ వేట మొదలు పెట్టింది. బెయిల్‌ కోసం ముడుపుల వ్యవహారం పట్టాభి అరెస్టుతో మొత్తం ముగ్గురు అరెస్టు అయ్యారు.