మంత్రాలకు చింతకాయలు రాలితే మస్తుగనే ఉండేది !

మంత్రాలకు చింతకాయలు రాలుతాయని పూర్వం ఒకడు జనాన్ని అందినకాడికి దోచుకున్నడట ! ఇక్కడ తప్పు మోసం చేసిన కాదు. మోసపోయిన జనానిదే ! శ్రమ లేకుండా చింతకాయలు రాలితే, వాటిని సొమ్ము చేసుందామనుకున్న జనానిదే. వాడు తన స్వార్థం మంత్రాలను చదువుతాను.. చింతకాయలను రాల్చుతాను అని చెప్పి, తాను జనాన్ని నమ్మించడానికి పడ్డ శ్రమకు ప్రతిఫలం పొంది, దాన్ని అనుభవించాడు. ఎటొచ్చి మోసపోయింది పని తప్పించుకుందామని నమ్మిన జనమే. గతంలోనే కాదు.. ప్రస్తుత కాలంలోనూ ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయి’ అని చెప్పి జనం నెత్తిన శఠగోపం పెట్టేవాళ్లున్నారు. రోజుకో స్కాం వెలుగులోకి వస్తున్నా, జనం మాత్రం ఏ మాత్రం అప్రమత్తంగా ఉండకుండా పాపం.. మోసపోతూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాల ఈ ‘చింతకాయల’ మంత్రాన్ని కొందరు కేవలం ధనం కోసమే జపించేవారు. కానీ, నేడు రాజకీయాల్లోనూ ఈ మంత్రాన్ని జపించేవాళ్లు అధికమయ్యారు. నేటి రోజుల్లో ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని చల్లార్చేందుకు.. ఈ మంత్రాన్నే కొందరు రాజకీయ నాయకులు నిత్యం వల్లె వేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలతోనే వస్తుందని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీటీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. టీటీడీపీ నాయకులు తమ అధినేతకు చెప్పలేక జనంలో తిరగలేక మా ‘బాబు’ మంచోడే.. రేపోమాపో తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటిస్తాడు.. ఆయన ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకమని అనలేదు.. అని తమదైన ‘చింతకాయల’ మంత్రాన్ని పఠించి, నాలుగున్నర కోట్ల మందిని నమ్మించేందుకు ప్రయత్నించి.. ప్రయత్నించి చివరకు విఫలమయ్యారు. వీళ్ల నాయకుడు చంద్రబాబు కూడా మొన్నంటే మొన్ననే ఈనెల మొదటి వారంలోగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలుపుతానని, పరోక్షంగా తన అనుయాయులతో పుకార్లు చేయించి, వారం దాటుతున్నా పట్టించుకోకుండా, బీసీ మంత్రాన్ని జపిస్తూ ఢిల్లీ చక్కర్లు కొడుతూ, తనకు మాట కన్నా, వందల మంది యువకుల బలిదానాల కన్నా కుర్చీపైనే ప్రేమెక్కువని చెప్పకనే చెబుతున్నాడు. ఇక కాంగ్రెస్‌ నాయకుల సంగతి సరేసరి. వీరు కూడా గతంలో ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందని, డిసెంబర్‌ 9న ప్రకటన కూడా తాము అధిష్టానం చేసిన పోరాటాల ఫలితమేనని విజయయాత్రలు చేశారు. చివరకు ఆ ప్రకటన కాస్తా తెలంగాణ జనుల గుండెల మీద తన్నినట్లు వెనక్కి పోతున్నా చూస్తూ ఉండిపోయారు తప్పితే ఆ కీలక సమయంలో ఎలాంటి ఉద్యమానికి ఉపక్రమించక మరింత మంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలకు పరోక్షంగా కారణమయ్యారు. ఆ తర్వాత కూడా మా ‘అమ్మ’ కరుణిస్తుంది.. తెలంగాణ ఇస్తుంది.. అంటూ ఇంత కాలం నెట్టుకొచ్చారు. చివరికి ఆ ‘ఆమ్మ’ చేతిలోనే నిండు లోక్‌సభలో అవమానానికి గురయ్యారు. అయినా, ‘అమ్మ’ మీద తమకు నమ్మకం ఏ మాత్రం సడలలేదని పైపైన బుకాయించారు. ఏదేమైనా టీడీపీ మాదిరే ఉద్యమాన్ని పట్టించుకోలేదు. చివరిగా టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే.. తమది ఉద్యమ పార్టీ అని.. తమ పార్టీ ఆవిర్భావం జరిగిందే తెలంగాణ రాష్ట్ర  సాధన కోసమని.. ఎన్నోసార్లు ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్రం అనే ఆకాంక్ష కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యాగం చేశామని ఇప్పటికీ చెబుతుంటారు. కానీ, నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాదాపు ఖరారవుతుందన్నట్లు ఆ పార్టీ భాగస్వామ్యంలో సాగిన సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమాలు ఎందుకు చల్లారిపోయాయో చెప్పడానికి నేటికీ వారి దగ్గర సమాధానం లేదు. ఆ ఉద్యమాల విరమణ జరగకపోయుంటే తెలంగాణ అప్పుడే వచ్చేసేదేమోనన్న అనుమానం ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో లేకపోలేదు. నిన్నా మొన్నటి వరకు ఆగస్టు వరకు కేంద్రానికి డెడ్‌లైన్‌ విధిస్తున్నామని, ఈలోపు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ డెడ్‌లైన్‌ దాటి పోయినా తీసుకున్న చర్యలు శూన్యం. కేసీఆర్‌ తీరుతో సీమాంధ్రుల్లో వీళ్లింతే అంటూ తెలంగాణ ప్రజలు చులకనయ్యే పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా, సెప్టెంబర్‌లో తెలంగాణ ఏర్పాటు తథ్యమని, తనకు సంకేతాలు వచ్చాయని చెప్పారు. కేసీఆర్‌ ఈ ప్రకటన చేసింది కూడా తెలంగాణ జేఏసీ సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత. కేసీఆర్‌కు ముందే సంకేతాలు అంది ఉంటే, జేఏసీ చెప్పి కార్యాచరణ అవసరం లేదని, తాను చేసిన ప్రకటనేదో జేఏసీ చైర్మన్‌ కోదండరాంతోనే చేయించవచ్చు కదా ! కానీ, అలా చేయలేదు. అటు తర్వాత తనకు సంకేతాలు అందాయి, కాబట్టి, ఇక ఉద్యమాలు అవసరం లేదన్నట్లు ప్రకటనలు చేశారు. కానీ, ఆ ప్రకటనల్లో స్పష్టత లేదు. ఉద్యమ పార్టీ అధినేతగా కేసీఆర్‌ను అభివర్ణించే టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా తమ నాయకుడి అంతరంగాన్ని ఎక్కడ కూడా బహిర్గత పర్చడం లేదు. దీంతో ప్రజలు టీడీపీ, కాంగ్రెస్‌లాగే టీఆర్‌ఎస్‌ కూడా ‘చింతకాయల’ మంత్రాన్ని జపిస్తుందేమోనని భావించాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటుంది. మంత్రాలకు ఏనాడూ చింతకాయలు రాలవని.. డెడ్‌లైన్లతో తెలంగాణ రాదని.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ప్రత్యక్ష ఉద్యమాలు చేయాల్సిందేనని. కాబట్టి, ఏ నాయకుడు ఏ మంత్రాన్ని జపించినా, ఏ మాయ చేయాలని చూసినా, ప్రజలు మాత్రం ఉద్యమాలపై వెనక్కు తగ్గొద్దు. పోరాటాన్ని ఆపొద్దు. తెలంగాణ జేఏసీ నిర్వహించతలపెట్టిన సెప్టెంబర్‌ 30న ‘తెలంగాణ మార్చ్‌’లో పాల్గొనాలి. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మళ్లీ చాటాలి. ఈలోపే తెలంగాణ వస్తే మంచిది. లేదంటే, కార్యాచరణను రూపొందించుకుని, రాజకీయేతర నాయకత్వంలో తమ పోరాటాలను మరింత ముందుకు సాగించాలి. ప్రత్యేక రాష్ట్రాన్ని తమకు తాముగా సాధించుకోవాలి.