మద్యం లాటరీ విధానాన్ని అడ్డుకుంటాం

విజయనగరం, జూన్‌ 24 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలో 202 మద్యం షాపుల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న లాటరీ విధానాన్ని తాము అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సత్తా, సీపీఎం, సీపీఐలకు చెందిన బీశెట్టి బాబ్జి, ఎం. కృష్ణమూర్తి, సూరిబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25న జరిగే లాటరీ విధానాన్ని అడ్డుకుని ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామన్నారు. దీనికి సంబంధించి ఎక్సైజ్‌ అధికారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 88 దరఖాస్తులు దాఖలయ్యాయని, ఆ మేరకు దరఖాస్తులను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.