మధ్య ప్రదేశ్‌లో దారుణం స్విట్జర్లాండ్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌

భోపాల్‌, మార్చి 16 (జనంసాక్షి):
ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చట్టాలకు పదును పెట్టినా మహిళలపై అకృత్యాలు లేగడం లేదు. ఢిల్లీ దారు ణోదంతం తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తినా.. ప్రభుత్వం తాజాగా అత్యాచార నిరోధక బిల్లు తీసుకువచ్చినా స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. పరదేశీ వనితలకు కూడా దేశంలో భద్రత కొరవడింది. తాజాగా, స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఎనిమిది దుండగులు స్విస్‌ యువతిపై దారుణానికి పాల్పడ్డారు. యావత్‌ జాతి సిగ్గుపడే ఈ ఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో చోటు చేసుకుంది.స్విట్జర్లాండ్‌కు చెందిన దంపతులు భారత పర్యటనకు వచ్చారు. పర్యాటక ప్రాంతమైన ఓర్చాలో స్విస్‌ యువతి తన భర్తతో కలిసి శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా.. ఎనిమిది దుండగులు అడ్డుకున్నారు. వారి వద్ద నున్న నగదు, నగలు   దోచుకున్నారు. అంతటితో వదిలేయకుండా యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఒకరి తర్వాత మరొకరు ఎనిమిది మంది దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్విస్‌ దంపతులు షాక్‌కు గురయ్యారు. బాధితులు దాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది చుట్టుముట్టి దోపిడీకి పాల్పడ్డారని, తన భార్యపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని దాటియా ఎస్పీ సీఎస్‌ సొలంకి తెలిపారు. బాధితురాలిని గ్వాలియర్‌లోని కమల్‌రాజే ఆస్పత్రికి తరలించి, వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అనుమానితులను విచారిస్తున్నామని, వాస్తవాలు త్వరలోనే వెలికితీస్తామని చెప్పారు.