గాంధీ పేరు మార్చడాన్ని సహించం
` ‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర
` పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది : సోనియా గాంధీ
న్యూఢల్లీి(జనంసాక్షి):మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు మోదీ ప్రభుత్వం దశాబ్ది కాలంగా అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఇటీవల ఈ చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేయడంతోపాటు దేశంలో కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని వారి ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందన్నారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.20ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హావిూ పథకాన్ని పార్లమెంటు ఏకాభిప్రాయంతో ఆమోదించిన విషయాన్ని సోనియా గాంధీ గుర్తుచేశారు. అదో విప్లవాత్మకమైన అడుగు అని.. అత్యంత పేదలు, అణగారిన వారి జీవితాలకు ఉపాధి మార్గంగా నిలిచిందన్నారు. వలసలు ఆగిపోవడమే కాకుండా, ఉపాధికి హావిూ ఇచ్చిందన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తీసుకొచ్చిన ఆ పథకాన్ని మోదీ ప్రభుత్వం అణచివేసిందని ఆరోపించారు.గడిచిన 11 ఏళ్లుగా గ్రావిూణ పేదల ప్రయోజనాలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం.. మహాత్ముడి పేరు తొలగించడమే కాకుండా పథకం స్వరూపాన్నే మార్చిందని సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఎటువంటి చర్చ లేకుండా, ఎవర్నీ సంప్రదించకుండా, విపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాన్ని మార్చివేయడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సోనియా గాంధీ పేర్కొన్నారు.



