భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
` ప్రధాని మోడీకి మరో గౌరవం
` ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం ప్రదానం
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పై భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ మంత్రి కియాస్ బిన్ మొహమ్మద్‌లు సంతకాలు చేశారు. దీన్ని ఇరుదేశాల అధినేతలు స్వాగతిస్తూ.. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.మూడు దేశాల పర్యటనలో భాగంగా ఒమన్‌లో ఉన్న ప్రధాని మోదీ ఆదేశ ప్రధాని, సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జశ్వాల్ పేర్కొన్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఓ మైలురాయిగా అభివర్ణించినట్లు చెప్పారు.
అత్యున్నత పురస్కారం..
సుల్తాన్ హైతమ్ ఆహ్వానం మేరకు ఒమన్‌లో పర్యటించిన మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేసినందుకు మోదీకి అక్కడి ప్రత్యేక పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇక ఒమన్‌లో మోదీ పర్యటించడం ఇది రెండోసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తైన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధాని మోడీకి మరో గౌరవం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒమన్ దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం. ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్, ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. మోదీకి ’ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ’ఆర్డర్ ఆఫ్ ఒమన్’ అనేది ఒమన్, విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం.భారత్ ` ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా ’ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్`కబీర్’తో ఆయనను గౌరవించింది. బుధవారం ఇథియోపియా తన అత్యున్నత పురస్కారమైన ’నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో ప్రధాని మోదీని సత్కరించింది.


