తండ్రిపై రూ.3 కోట్ల బీమా చేశారు

డిసెంబర్20 (జనం సాక్షి):తండ్రికి పెద్ద మొత్తంలో బీమా చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ చేసుకుందామని అనుకున్నారు. అయితే వారిపై బీమా సంస్థ అధికారికి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. కాసుల కక్కుర్తితో కన్నతండ్రినే కుమారులు చంపేశారని తేలింది. ఈ అమానుష ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది.
తిరువళ్లూరు జిల్లా తిరుత్తని సమీపంలోని పొదట్టూర్‌పెట్టయ్‌కి చెందిన గణేశన్ (56).. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా (Lab Assistant) పనిచేస్తున్నారు. అక్టోబర్ 22న తన నివాసంలో పాముకాటుతో చనిపోయారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన రూ.3 కోట్ల బీమా డబ్బుల కోసం అతడి ఇద్దరు కుమారులు ఇన్సూరెన్స్ కంపెనీనీ ఆశ్రయించారు. దీంతో వారికి అనుమానం రావడంతో విచారణ జరిపారు. గణేశన్‌పై అధిక విలువ గల అనేక పాలసీలు ఉండడం, తండ్రి మరణించి వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేశన్ కుమారులు మోహన్‌రాజ్ (26), హరిహరన్ (27) ప్రైవేట్ ఉద్యోగులు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడి నష్టపోయారు. దీంతో అప్పుల నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్న అన్నదమ్ములు.. పథకం ప్రకారం తండ్రి పేరుపై రూ.3 కోట్ల బీమా చేయించారు. అనంతరం ప్రమాదవశాత్తూ తమ తండ్రి చనిపోయినట్లు నమ్మించడానికి పాము కాటుతో చంపాలని కుట్ర పన్నారు.
ప్లాన్ ప్రకారం స్నేహితుల సహాయంతో ఒక పామును తమ తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన పక్కన వదిలారు. అది కాలుపై కరవడంతో ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు దవాఖానకు తరలించిం రక్షించారు. తమ ప్రయత్నం ఫలింకపోవడంతో వారం రోజుల తర్వాత మరో అత్యంత విషపూరితమైన పామును తీసుకువచ్చి.. గణేశన్ నిద్రపోతున్న సమయంలో అతడి మెడపై కాటు వేయించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు పామును అక్కడే చంపేశారు. అయితే అతడిని దవాఖానకు తరలించే విషయంలో నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారితోపాటు వాళ్లకు సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేశారు.



