ద్వేషించే వారిని సైతం ప్రేమించాలి
` మానవాళికి ఏసుక్రీస్తు సందేశం
` డిసెంబరు నెల క్రైస్తవులకే కాదు.. కాంగ్రెస్‌కు కూడా మిరాకిల్ మంత్
` ఇతర మతాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు
` పేదల ఇళ్లలో వెలుగులు నింపాం
` అన్ని మతాలపట్ల తాము సమానంగా ఉంటాం
` మైనార్టీలకు అందించే సంక్షేమం దయ కాదని అదీ వారి హక్కు
` క్రిస్మస్ వేడుకల కోసం రూ.33 కోట్ల నిధులు
` పేదల ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ ఆహార భద్రత చట్టం తెచ్చింది
` క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటీ పడి విద్య, వైద్యం అందించాయి
` వచ్చే అసెంబ్లీ సమావేశంలో హెట్ రేట్ చట్టం ప్రవేశపెడతాం
` రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఘనంగా క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా ఏసు ప్రభువు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారన్న సీఎం కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ నెల కీలకమైందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ కూడా డిసెంబర్ నెలలోనే జన్మించినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రుల పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.తెలంగాణలో క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే అందులో సోనియాగాంధీ పాత్ర, త్యాగం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే డిసెంబర్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరదని తెలిపారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.పేదవాడి ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నింపామన్నారు. రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04 లక్షల కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటీ పడి విద్య, వైద్యం అందించాయని అన్నారు.మైనార్టీలకు అందించే సంక్షేమం దయ కాదని అదీ వారి హక్కు అని సీఎం రేవంత్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్‌లకు సంబంధించిన స్మశానాలకు స్థలం ఇవ్వాలంటే ప్రభుత్వం వద్ద లేదని ఊరికి దూరంగా స్మశానాలు నిర్మించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్ని మతాలపట్ల తాము సమానంగా ఉంటామన్న సీఎం ఇతర మతాలను కించపరిచేలా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో హెట్ రేట్ చట్టం ప్రవేశపెడతామని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని మంత్రి అజారుద్దీన్ అన్నారు. క్రిస్మస్ వేడుకలను సీఎం ఘనంగా జరిపిస్తున్నారని తెలిపారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేస్తున్న మేలుకు ఎప్పుడూ అండగా ఉంటూ మద్దతూ ఇస్తామని అన్నారు. క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్ల నిధులు కేటాయించినట్లు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ వెల్లడిరచారు. రూ.30 వేల చొప్పున రాష్ట్రంలోని 7 వేల చర్చిలకు నిధులు అందుతాయని తెలిపారు.
ఆజ్మీర్ దర్గాకు సీఎం చాదర్ సమర్పణ
అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి,ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, టీఎంఆర్‌ఈఐఎస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు.
నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్
` ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నమోదైన కేసులలో విచారణకు వ్యక్తిగతంగా హాజరైన ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణకు ఆయన హాజరు కావడం విశేషం. మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ కార్యక్రమాల సందర్భంలో నమోదయినవి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి. కోర్టులో జడ్జి ముందు రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ పక్రియ పూర్తి చేశారు. మూడు కేసుల్లోనూ ఈ దశ పూర్తయిన నేపథ్యంలో తదుపరి విచారణ లేదా తీర్పు కోసం కోర్టు తేదీ నిర్ణయించనుంది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విూడియా, సామాన్యులను కోర్టు హాల్ సవిూపంలోకి అనుమతించలేదు. కాంగ్రెస్ నేతలు ఈ కేసులను రాజకీయ కుట్రతో మోపినవని విమర్శిస్తున్నారు.
ఇంత ఉదాసీనత సహించేది లేదు
` 16 మంది ఎమ్మెల్యేలకు క్లాస్‌పీకిన రేవంత్
` నిబంధనలకు లోబడి పనిచేయండి
` మీ వైఖరి వల్ల కాంగ్రెస్ పట్టున్న ప్రాంతాల్లో సర్పంచులను కోల్పోయామని ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి విూనాక్షి నటరాజన్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు.రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులపై రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్స్‌తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని తప్పుబట్టారు. పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు.తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో భారాస గెలుపొందింది. భాజపా 688 స్థానాలు పొందగా… ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. అయితే తమకు పట్టున్న కొన్ని చోట్ల స్థానాలను కోల్పోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈక్రమంలోనే దానికి బాధ్యులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశం నిర్వహించింది.


