భారత్‌ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం

` వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్ల పైనే..!
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఓవైపు బీజింగ్‌ నుంచి మన దేశానికి దిగుమతులు భారీగా ఉంటుండగా.. భారత్‌ నుంచి చైనాకు ఎగుమతులు మాత్రం చాలా తక్కువస్థాయిలో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది చైనాతో మన వాణిజ్యలోటు 106 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. చైనా నుంచి అత్యధికంగా ఎలక్ట్రానిక్స్‌, మెషినరీ, ఆర్గానిక్‌ కెమికల్స్‌, ప్లాస్టిక్‌ సంబంధ దిగుమతులు పెరుగుతున్నట్లు తెలిపింది.
జీటీఆర్‌ఐ నివేదికలో కీలక అంశాలివే..
2021లో భారత్‌లోకి చైనా దిగుమతుల విలువ 87.7 బిలియన్‌ డాలర్లు ఉండగా.. గతేడాది 109.6 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2025లో ఆ దిగుమతుల విలువ ఏకంగా 123.5 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా.ఇక, 2021లో చైనాకు మన దేశం నుంచి ఎగుమతి చేసిన వస్తువుల విలువ 23 బిలియన్‌ డాలర్లు ఉండగా.. గతేడాది నాటికి ఆ మొత్తం 15.1 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 2025లో ఎగుమతుల విలువ స్వల్పంగా పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని జీటీఆర్‌ఐ అంచనా వేసింది. అయితే, గతంతో పోలిస్తే ఈ విలువ చాలా తక్కువే. ఎగుమతులు తగ్గుతుండటంతో చైనాతో భారత్‌కు వాణిజ్య లోటు భారీగా ఉంటోంది. 2021లో భారత వాణిజ్య అంతరం 64.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. గతేడాది 94.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది వాణిజ్య లోటు 106 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.ఈ ఏడాది జనవరి-అక్టోబరు మధ్య చైనా నుంచి అత్యధికంగా ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత పరికరాలు, ఉపకరణాలు దిగుమతి అయ్యాయి. వీటి విలువ 38 బిలియన్‌ డాలర్ల పైనే ఉంది. ఇందులో మొబైల్‌ ఫోన్‌ కాంపోనెంట్స్‌ (8.6 బిలియన్‌ డాలర్లు), ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ (6.2 బిలియన్‌ డాలర్లు), ల్యాప్‌టాప్‌లు (4.5 బిలియన్‌ డాలర్లు), సోలార్‌ సెల్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీలు వంటివి ఉన్నాయి.ఇక, నవంబరులో చైనాకు 2.2 బిలియన్‌ డాలర్ల వస్తువులు మన దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఏప్రిల్‌-నవంబరు మధ్య మొత్తం ఎగుమతుల విలువ 12.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఉపయోగించే నాఫ్తాను ఎక్కువగా ఎగుమతి చేయడంతో.. ఈ ఏడాది పొరుగు దేశానికి మన ఎగుమతుల విలువ స్వల్పంగా పెరిగిందని జీటీఆర్‌ఐ తెలిపింది