గ్రీన్‌ కార్డు లాటరీ నిలిపివేత

` తాత్కాలిక వాయిదా వేస్తూ ట్రంప్‌ సంచలన నిర్ణయం
వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌గా ప్రసిద్ధి చెందిన గ్రీన్‌కార్డ్‌ లాటరీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇటీవల బ్రౌన్‌ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఎంఐటీ ప్రొఫెసర్‌ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటనకు కారణం పోర్చుగీస్‌ జాతీయుడు క్లాడియో నేవెస్‌ వాలెంటే (48)నని అమెరికా పోలీసులు గుర్తించారు. వాలెంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు గ్రీన్‌ కార్డ్‌ లాటరీని అస్త్రంగా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.ఈ క్రమంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్‌ సోషల్‌ విూడియాలో స్పందించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులు అమెరికాలో అడుపెట్టేందుకు అనర్హులు. అందుకే, అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు ఙూఅఎూ గ్రీన్‌ కార్డ్‌ లాటరీని నిలిపివేస్తోంది’ అని తెలిపారు.
గ్రీన్‌కార్డ్‌ కేటాయింపులు ఇలా
ప్రతి సంవత్సరం 50వేల గ్రీన్‌కార్డులను అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల అభ్యర్థులకు కేటాయిస్తారు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాల అభ్యర్థులు ఉంటారు. 2025 లాటరీకి దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో కుటుంబ సభ్యులను కలుపుకొని 1,31,000 మందిని ఎంపిక చేశారు. పోర్చుగీస్‌ పౌరులకు కేవలం 38 స్లాట్లు మాత్రమే లభించాయి. ఈ ప్రోగ్రామ్‌ను అమెరికా కాంగ్రెస్‌ సృష్టించింది. కాబట్టి దీని నిలిపివేతపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ట్రంప్‌ చాలా కాలంగా ఈ లాటరీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా బ్రౌన్‌ యూనివర్సిటీ కాల్పుల ఘటనతో గ్రీన్‌కార్డ్‌ లాటరీ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్‌ నిర్ణయం హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్‌ ప్రకటించారు.ఇదిలా ఉండగా..ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వలస విధానాలపై చర్చకు దారితీశాయి. భద్రతా కారణాల వల్ల తీసుకున్న ఈ చర్య.. అమెరికాలో స్థిరపడాలనుకున్న విదేశీయులపై ప్రతికూల ప్రభావం పడనుంది.