ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి

 

 

 

 

 

డిసెంబర్ 19 (జనం సాక్షి):ఒకే కంపెనీలో పనిచేసే సహోద్యోగుల మధ్య పరిచయం ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా కేసీఆర్ నగర్‌లో(KCR Nagar) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..​మృతురాలు సకిన ఫాతిమా, హుస్సేన్‌ అలీ ఇద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఫాతిమా కుటుంబానికి కేసీఆర్ నగర్‌లోని బ్లాక్ నంబర్ 40లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించారు. కాగా, నిన్న ఫాతిమా, హుస్సేన్‌ అలీ కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇంటికి చేరుకున్నారు.

అదే సమయంలో ఫాతిమా తండ్రి రావడంతో ఫాతిమా తండ్రికి దొరికిపోతామనే భయంతో ఆమె హుస్సేన్‌ అలీ సహకారంతో బాల్కనీ గుండా పక్క ఫ్లాట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.