బుగ్గ శివారులో పెద్దపులి అలజడి

డిసెంబర్20 (జనం సాక్షి):మంచిర్యాల జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ సిబ్బంది బుగ్గ శివాలయ ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు.
కాసిపేట మండలంలోని తిరుమలాపూర్ మీదుగా బుగ్గగూడెం ప్రాంతానికి వచ్చిన పెద్దపులి.. అక్కడ సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో బుగ్గగూడ శివారులో పెద్దపులి ఓ బర్రెను హతమార్చిన విషయం తెలిసిందే. కాసిపేట, తిర్యాణి మధ్య విస్తరించి ఉన్న అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులి మళ్ళీ జనావాసాలకు దగ్గరగా సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుగ్గ దేవాలయం వెనుక వైపు పెద్దపులి సంచరించగా, వాటి ఆధారంగా అది మాదారం వైపు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు శివారు గ్రామాల్లో, బుగ్గగూడెం గ్రామ పంచాయతీలో పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు వేయించారు. అడవిలోకి వెళ్లొద్దని, పశువులను తీసుకుపోవద్దని, జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.



