కోల్‌కతా07 మార్చి (జనంసాక్షి): పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని తృణముల్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆదివారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లు బెంగాల్ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని, రాబోయే ఐదేళ్లలో ఇక్కడ జరిగే అభివృద్ధి, బెంగాల్ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్య్రాన్ని జరుపు నేటప్పుడు బెంగాల్ మరోసారి దేశానికి నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, వారి కలల సాకారానికి ప్రతి క్షణం శ్రమిస్తున్నామని తెలిపారు.పెట్టుబడులు, పరిశ్రమలు పంచడం ద్వారా బెంగాల్‌ను పునర్నిర్మాణం చేస్తామని అన్నారు.పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తామని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుందన్నారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. బెంగాల్ సంస్కృతి, కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ బహిరంగ సభకు వేదికైన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎంతో మంది గొప్ప నాయకులకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. మార్పు కోసం బెంగాల్ ప్రజలు తమ ఆశలను ఎప్పుడూ వదిలిపెట్టలేదని గుర్తుచేశారు. బెంగాల్‌లోని కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షపార్టీలు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బెంగాల్ వ్యతిరేక విధానాలతో ప్రవర్తించనున్నా యని తెలిపారు. గత 75 ఏళ్లలో బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని ప్రసంగానికి కంటే ముందు సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. మర్చి27న ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి.