మయన్మార్‌లో మారణహోమం

20 వేలపై చిలుకు ముస్లింల ఊచకోత
కళ్లు, నోరు మూసుకున్న అంతర్జాతీయ మీడియా
జాడలేని ప్రపంచ పెద్దపోలీసు అమెరికా
ప్రశ్నించని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు
జనంసాక్షి ప్రత్యేకం
అక్కడ దారి పొడవునా శవాల గుట్టలు.. ఊచకోతలో ఎగిసిన రక్తంతో తడిసి ముద్దైన నేల అది…చిన్నా పెద్దా తేడా లేదు..ఆడా, మగా అస్సలు లేదు. ముస్లిం మతస్థుడు అయితే చాలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలకు వేలు..మొత్తంగా దాదాపు ఇరవై వేలు..ఆ దారుణ మారణ హోమంలో బలయ్యారు… ఆకాశాన్నంటే రోదనలు.. తమను కాపాడమంటూ ప్రార్థనలు అక్కడ అరణ్య రోదనలే అయ్యాయి…మానవ హక్కులపై గొంతు చించుకొనే ప్రపంచ పోలీసు.. అమెరికా నోరు విప్పదు..ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఏ చిన్న సంఘటన అయినా స్పందిస్తూ, 24I7 లైవ్‌ పెట్టే ఎలక్ట్రానిక్‌ మీడియా అక్కడ కన్పించదు. కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన విషపు పత్రికలలో ఆ వార్తలకు స్పేస్‌ లేదు. ఏం జరుగుతోంది అక్కడ..ఏదేశమది..జనంసాక్షి ఎక్స్‌క్లూజివ్‌ కథనం……
హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి):
రెండు కాళ్లపై నిటారుగా నిలబడ్డ మనిషి నాలుగు కాళ్ల మృగ లక్షణాలను ఇంకా వదల్లేదు. మధ్య యుగాల నాటి ఆటవిక న్యాయం ఇప్పటికీ సజీవంగానే ఉంది. గ్లోబలైజేషన్‌ గొడుగు క్రింద మనుషులంతా దగ్గరయ్యారని సంబరపడుతున్నా మానవత్వం కంటికి కనుబడకుండా పోతుంది. మనిషిని చూసిన మనిషే భయంతో వణికి పోతున్నారు. మన ఈశాన్య మూలన బర్మాలో జరుగుతున్న మానవ హననం గురించి తెలిస్తే నోట మాట పెగలదు. నియంతల కాలం నాటి మానవ హననం కాదిది..మనుషులను పాలిస్తున్న నాగరిక మృగాల మారణకాండకు సజీవ సాక్ష్యాలు ఈ శవాలు. బ్రహ్మ దేశంగా కీర్తికెక్కిన మన పక్క దేశంలోని దృశ్యాలివి. మయన్మార్‌లో సాధారణ పరిపాలనకే పరిమితమైందనుకున్న నియంతృత్వం మానవ మనుగడనే శాసిస్తుంది. లక్షలాది మంది రోహింగ్యా తెగకు చెందిన ముస్లిం మైనార్టీల ఉనికినే ప్రశ్నార్థకంలో పడేసింది. మే నెలలో ఓ బుద్దిస్ట్‌ మహిళను ఎవరో రేప్‌ చేసి హత్య చేశారన్న కారణంతో మొదలైన ఊచకోత వేలాది మందిని పొట్టన పెట్టుకొంది. ఈ రెండు నెలల కాలంలో ఊచకోతకు గురయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని స్వచ్చంద సంఘాలు అంటుంటే కాదు వెయ్యి కన్నా ఎక్కువని యూఎన్‌వో అధికారింగా చెప్తుంది. బంగ్లాదేశ్‌ను ఆనుకొని బర్మా సరిహద్దులో ఉన్న రాఖినే ప్రావిన్స్‌లో ఉన్న రోహింగ్యా తెగకు చెందిన ముస్లింలు సుమారు 8 లక్షల మంది ఉన్నారని అంచనా. అటు బంగ్లాదేశ్‌ వైపు దాదాపు రెండు లక్షలు. అయితే రెండు దేశాలలోనూ వీరికి వారసత్వం లేదు. బతుకు దెరువు లేక వివక్షను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారికి ఉపాధినివ్వదు. స్వయం ఉపాధి వెతుక్కుందామన్నా స్థానిక బుద్దిస్ట్‌ల అనుమతి తప్పనిసరి. కనీసం ఓ చిన్న వ్యాపారం చేసుకుందామన్న ఓ బుద్దిస్ట్‌ను కలుపుకోవాల్సిందే. అది కూడా అవతల వైపునుంచి ఎలాంటి పెట్టుబడి లేకుండానే. ఒక వేళ ఏదైనా తేడా వస్తే ఆ బుద్దిస్ట్‌ చెప్పిందే ఫైనల్‌. ఇక పిల్లలు పుట్టినా చనిపోయినా సర్కారుకు పన్ను కట్టాల్సిందే. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశం లేదు. ఉపాధి కోసం సెంట్రల్‌ బర్మాలోకి వస్తే నిర్దాక్షిణంగా వెనక్కి పంపుతారు. ఈ క్రమంలో మే నెలలో జరిగిన చిన్నపాటి ఘటన వీరి ఊచకోతకు కారణమైంది. రెండు నెలలుగా మానవహక్కుల హననం జరుగుతుంది. ఫలితంగా మైనార్టీలు రోజులు లెక్కపెట్టడం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం బర్మాలో 1948కి ముందున్న వారు మాత్రమే ఆ దేశ పౌరులు. ఆ తర్వాత వచ్చిన వారెవరైనా అక్రమ చొరబాటు దారుల క్రిందే లెక్క. ఫలితంగా బర్మా, బంగ్లాదేశ్‌ రెండు దేశాలలోనూ పరదేశీయులైపోయారు. బర్మా నిర్బందానికి దూరంగా పోదలుచుకున్న వారు థాయిలాండ్‌ వంటి సుదూర ప్రాంతాలకు పడవల్లో పయనమవుతున్నారు. క్యాంపుల్లో కాలం వెల్లదీస్తున్న సుమారు 3 లక్షల మంది అనుభవాలు రోజుకో రకంగా ఉంటున్నాయి. బంగ్లాలో ఉంటున్నవారిని కూడా వెనక్కి పిలుపించుకోవాలని ఆ దేశ సర్కారు ఇటీవల చెప్పడంతో వారి పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా అయింది. సుమారు ఏడో శతాబ్దంలో వ్యాపారం కోసం వచ్చిన అరబ్బుల సంతతే రోహింగ్యా తెగ ముస్లింలుగా చెబుతారు. శతాబ్దాల క్రితమే వచ్చి బర్మా సంస్కృతిలో కలిసి విడదీయరాని భాగమయ్యారు. అయినా స్థానిక బుద్దిస్ట్‌లు వీరిని అనుమానంగా చూడడం ఈ పరిమాణాలకు దారితీస్తుంది. తమ అణిచివేతను, ఊచకోతను చిత్రీకరించి ప్రపంచానికి చూపాలని అంతర్జాతీయ మీడియాకు రోహింగ్యా తెగ ముస్లింలు మొరపెట్టుకొంటున్నారు. తమ కష్టాలు తీర్చే వారిని పంపాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తీవ్రంగా తప్పుపట్టింది. కనీసం ఇప్పటికైనా మానవహక్కుల సంఘాలు జోక్యం చేసుకొని ఈ దారుణ మారణ కాండను ఆపాలి.