చర్చ అక్కడెందుకుంటది.. అసెంబ్లీకి రా..
` కేటీఆర్ లెక్కలకు సమాధానం ఉంది
` అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చిస్తాం
` కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమే
` అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టలేరు
` కేటీఆర్ విమర్శలపై మంత్రుల కౌంటర్
మహబూబాబాద్(జనంసాక్షి):బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాళ్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. తాము చేసిన సవాల్‌కు సిద్ధమేనని, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చకు సిద్ధంగా కావాలన్నారు.ప్రజల పట్ల ఏ మాత్రం నిబద్ధత ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రావాలని, తాము కూడా లెక్కలతో సహా వస్తామని, శాసనసభలోనే తేల్చుకుందామన్నారు మల్లు.ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ ఒక పెద్ద మనిషి హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి…! నీకు అర్ధం అయ్యింది ఏంటి..?, ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదు. సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్‌ను రమ్మంటే ఆయన్ను రానివ్వకుండా ప్రెస్ క్లబ్ ఎవరో వచ్చి సవాళ్లు చేస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్‌క్లబ్‌కు రమ్మంటావా?, ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రిని చర్చకు రమ్మని స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రికి ఏ బేసిన్ గురించి తెలియదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా.. గోదావరి.. కృష్ణా జలాలు.. బేసిన్ గురించి.. ప్రజలకు తెలియ జేయడానికి చర్చించడానికి సిద్ధం. అసెంబ్లీలో చర్చకు మాజీ ముఖ్యమంత్రి రావాలి’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
కెటిఆర్ డ్రామాలు కట్టిపెట్టాలి
కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కెటిఆర్ డ్రామాలు ఆడడం ఆపేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం అసెంబ్లీ వద్ద విలేకరుతో మాట్లాడారు. కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముంటే కేసీఆర్‌ను తీసుకుని రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని.. చిల్లర చేష్టలు మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ లెటర్ ఇస్తే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లే ఏక కాలంలో రైతు రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. కేటీఆర్‌వి చిల్లర ప్రయత్నాలు అని విమర్శించారు. కేటీఆర్‌ని చూస్తే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చర్చించడానికి అసెంబ్లీ ఉందని గుర్తుచేశారు. కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డిది పెద్ద స్థాయి అని ఉద్ఘాటించారు. కేటీఆర్‌కి దమ్ముంటే కేసీఆర్‌ని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ విసిరారు. తమకి అనుకూలంగా రాస్తే అందరి విూడియా, వ్యతిరేకంగా రాస్తే ఆంధ్రా విూడియానా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమానికి ఏం చేసిందో కేసీఆర్‌ని అడిగితే తెలుస్తోందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. తెలంగాణ విూ జాగీరా?. సాగరహారం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు. సాగరహారం జరిగిన రోజుల్లో విూ మొహాలు ఎక్కడున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లం మేము. సారా అమ్ముతారు జై తెలంగాణ అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తారు.. జై తెలంగాణ అంటారు. బీఆర్‌ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో విూకు సంబంధం ఏంటి?. నీ చెల్లి కవిత ఫోన్‌ని ట్యాపింగ్ చేసి అణగదొక్కావ్. విూ చెల్లి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?. తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు విూరు. రేవంత్‌రెడ్డితో పోలిక పెట్టుకోవడానికి అర్హతే లేదు విూకు. నమ్మించి మోసం చేయడమే విూ అయ్య సంస్కృతి. ఆంధ్రా తెలంగాణ అంటూ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. వాళ్లకి అనుకూలంగా ఉంటే మంచి విూడియానా? లేకపోతే చెడ్డ విూడియానా?. బీఆర్‌ఎస్ పార్టీని విూ నలుగురు తప్ప.. ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. కేసీఆర్‌కి రావడం చేతకాక బచ్చగాడిని పంపుతారా. మాకు సానుభూతి ఉంది కాబట్టే హాస్పిటల్‌కి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శిస్తున్నాం. బావ, బామ్మర్ధులతో పాటు చెల్లి ఇప్పుడు పోటీలోకి వచ్చింది. అందరూ కలిసినా రేవంత్‌ని ఏం చేయలేకపోయారు. పిచ్చిమాటలు మాట్లాడితే మా తడాఖా చూపిస్తాం. మొన్నటి ఎన్నికల్లో కేటీ-ఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు- వచ్చేవి’ అని అద్దంకి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు.