సభకు రండి చర్చిద్దాం..
` మీ గౌరవానికి భంగం కలగకుండా సభానాయకుడిగా హామీ ఇస్తున్నా..
` కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మరణశాసనం
` జగన్‌తో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని నష్టం చేశారు
` కృష్టా జలాలను ఏపీ రాయలసీమకు తరలిస్తోంది
` ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి వాటా వస్తే ఇప్పుడు తక్కువ ధరకు మనకు విద్యుత్ దక్కేది
` సీమాంధ్ర పాలకుల కంటే కేసీఆర్ తెలంగాణకు వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారు
` కేసీఆర్, మా పాలనలో నిర్ణయాలపై చర్చిద్దాం
` వీధి బాగోతాల్లా కల్వకుంట్ల కుటుంబం గొడవలు
` కృష్ణా జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ అనుబంధం ఎలాంటిదైనా తెలంగాణకు తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. గత ప్రభుత్వం వాదించి ఉంటే హైదరాబాద్‌కు తాగునీరు సాధించేవాళ్లమన్నారు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సీఎం హాజరై మాట్లాడారు.‘‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవని కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి నుంచి 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించుకోవచ్చన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. జగన్‌కు సూచనలతో పాటు టెండర్లు, జీవోలు ఇచ్చేలా సహకరించారు. ఉమ్మడి కోటా నుంచి హైదరాబాద్‌కు తాగునీరు జలాలను వేరు చేయాల్సి ఉంది. నగరంలో ఏపీ ప్రజలు 20 శాతం వరకూ ఉన్నారు. హైదరాబాద్‌కు ఉమ్మడి జలాల నుంచి తాగునీరిచ్చేలా కేసీఆర్ చర్చించాల్సింది. మిగిలిన జలాలను పరివాహక ప్రాంతాలకు పంపకాలు చేసి ఉంటే బాగుండేది. తుంగభద్ర, కృష్ణా, బీమా జలాలు తొలుత గద్వాలకు వస్తాయి. తెలంగాణకు వచ్చిన వెంటనే ఒడిసి పట్టుకోవాల్సి ఉంది. వెంటనే పాలమూరు-రంగారెడ్డి, నల్గొండ ఇతర ప్రాంతాలకు తరలించాలి. తెలంగాణ వదిలితేనే ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు వెళ్తాయి. రాష్ట్రానికి వచ్చినప్పుడు వదిలేసి ఏపీ నుంచి తిరిగి వచ్చాక చివరకు తీసుకునేలా చేశారు. రాయలసీమకు వెళ్లిన జలాలను ఏపీ ఒడిసి పట్టుకుంటోంది. జూరాల నుంచే తెచ్చుకుంటే ఏపీ జలాలను కొల్లగొట్టే అవకాశం ఉండేది కాదు. కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రాంతాల రైతులకు మరణ శాసనంగా మారాయి. ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి వాటా వస్తే తక్కువ ధరకు విద్యుత్ దక్కేది.ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికి వెయ్యి రెట్లు కేసీఆర్ ద్రోహం చేశారు. సీమాంధ్ర పాలకులకు ఒక కొరడా దెబ్బ కొడితే.. కేసీఆర్‌ను వెయ్యి దెబ్బలు కొట్టాలి. గతంలో పాలమూరు-రంగారెడ్డి సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి తగ్గించారు. ఏపీ 10 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపడితే పాలమూరును ఒక టీఎంసీకి తగ్గించారు. ఏడాదికి కిలోమీటర్ టన్నెల్ పూర్తిచేసి ఉంటే ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యేది. గతంలో వెయ్యికోట్ల ప్రాజెక్టు అంచనా రూ.3వేల కోట్లకు పెరిగింది. 3.64 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఎస్‌ఎల్‌బీసీని పక్కన పెట్టారు. కృష్ణా జలాలను దారి దోపిడీ చేసే అవకాశం ఏపీకి ఆయనే ఇచ్చారు.కేసీఆర్ పాలనలో నిర్ణయాలు, మా పాలనలో నిర్ణయాలపై చర్చిద్దాం. వీధుల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చిద్దామన్నా. దయచేసి నన్ను క్లబ్బులు, పబ్బులకు పిలవొద్దు.. నేను రాను. కేసీఆర్ ఏ తేదీ చెబితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. స్పీకర్ అనుమతితో నిపుణులను కూడా అసెంబ్లీకి ఆహ్వానిస్తాం. సభా నాయకుడిగా హామీ ఇస్తున్నా.. ఎలాంటి గందరగోళం లేకుండా సభ నిర్వహిస్తాం. ప్రశాంత వాతావరణంలో అర్థవంతమైన చర్చ నిర్వహిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఆయన ఆరోగ్యంగా ప్రజాజీవితంలో ఉండాలి. కేసీఆర్‌కు ఇబ్బంది లేకుంటే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చపెడదాం. అక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. నాకేమీ భేషజాలు లేవు.. కేసీఆర్ నాకంటే చాలా సీనియర్. నేను కూడా రావాలని ఆయన కోరుకుంటే తప్పకుండా వెళ్తా. ఫామ్‌హౌస్‌లో భేటీకి కేసీఆర్ తేదీ నిర్ణయించి చెప్పాలి. ఎర్రవల్లికి మంత్రుల బృందాన్ని పంపిస్తా. కేసీఆర్‌కు ఇబ్బంది లేకుండా అక్కడే చర్చిద్దాం. నేపాల్‌లో ఓ యువరాజు కుటుంబంలో అందర్నీ చంపి రాజయ్యాడు. కేసీఆర్ కుటుంబంలో సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. కులపెద్దలు, పెద్ద మనుషులతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కేసీఆర్ కుటుంబ గొడవలు వీధి బాగోతాల్లా ఉన్నాయి. బావ, బావమరిది, చెల్లి గొడవలను జనం గమనిస్తున్నారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.