మరుపురాని ‘యాది’కి ఏడాది

స్వతంత్ర భారత చరిత్రలో పార్లమెంటు విధానాలను బాహాటంగా విమర్శించిన భారతీయులు ఇద్దరే ఇద్దరు. ఒకరు నాడు భారతావని స్వేచ్ఛ కోసం తిరగబడ్డ భగత్‌సింగ్‌. మరొకరు తెలంగాణ కోసం పరితపించి ప్రాణాలు వదిలిన తెలంగాణ ముద్దు బిడ్డ యాదగిరి. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. వాస్తవాలను యావత్‌ దేశానికి తెలియజేయడం. కానీ, వారు ఎంచుకున్న మార్గాలే వేరు. రంగారెడ్డి మొయినాబాద్‌ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన మందడి నర్సింహారెడ్డి, చంద్రమ్మ దంపతులంటే ఏడాది కిందటి వరకు ఎవరికీ తెలియదు. కానీ, నేడు యావత్‌ తెలంగాణ ఎన్నటికీ ఆ దంపతులను మరిచిపోదు. ఎందుకంటే, వారు తెలంగాణ ఉద్యమ అమరుడు యాదిరెడ్డికి జన్మనిచ్చారు. యాదిరెడ్డి చిన్నప్పటి నుంచే చురుకైనవాడు. అదే చురుకుతునంతో తెలంగాణ ఉద్యమంలోనూ అందరి కన్నా ముందున్నాడు. ఎక్కడ తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు జరిగినా పనులన్నీ పక్కనబెట్టి పాల్గొనేవాడు. తనతోపాటు మరికొందరిని ఉద్యమం వైపు ఆకర్షించేవాడు. స్నేహితులతో మాట్లాడినా తెలంగాణ ముచ్చట్లే. పాలకులు తెలంగాణను మోసం తీరుపై మండిపడేవాడు. తెలంగాణ అంశాన్ని కావాలని నాన్చుతున్నారని మదనపడేవాడు. ఎవరైనా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే, ఆ రోజు యాదిరెడ్డికి గొంతు నుంచి ముద్ద దిగేది కాదు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆరో తరగతిలోనే చదువు మానేసి, అమ్మకు సాయంగా పదేళ్ల వయస్సు నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న ‘పెద్ద’ కొడుకు యాదిరెడ్డి. అమ్మకు అండ అతడే. చెల్లెకు ధైర్యం అతడే. తమ్ముడికి ఆదర్శం అతడే. ఇన్ని గొప్ప లక్షణాలున్న యాదిరెడ్డి చేసే ప్రతి పనిలో ప్రశంసలు అందుకునే వాడు. ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన యాదిరెడ్డి, తెలంగాణ సాధన తన ప్రధాన బాధ్యత అనుకున్నాడు. అందుకే, తాను ఉద్యమిస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చాడు. ఎవరిని కలిసినా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, ఉద్యమ తీరును వివరించేవాడు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించాలని కోరేవాడు. ఇలాగే ఓ రోజు స్నేహితులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతున్నదని, దాని కోసం ఏదైనా చేయాలని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తానే ఏదో ఒకటి చేసి పాలకులకు కనువిప్పు కలిగిస్తానన్నాడు. అవసరమైతే దీని కోసం ఢిల్లీ వరకైనా వెళతానన్నాడు. యాదిరెడ్డి మాటలు విన్న అతని స్నేహితులు తమ స్నేహితుడికి తెలంగాణ సాధనపై ఉన్న చిత్తశుద్ధికి గర్వపడ్డారు. తమ స్నేహితుడు ఏదో వ్యూహం రచిస్తున్నాడని అనుకున్నారు. యాదిరెడ్డి కూడా అదే చేశాడు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ తనను యాది మరువని పని చేశాడు. జూలై 11, 2011 నాడు తాను ఢిల్లీ వెళ్తున్నానని, అదీ తెలంగాణ ఉద్యమం కోసమేనని మిత్రులకు తెలిపాడు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఓ అద్భుతం చేస్తానన్నాడు. ఏందని అడిగితే, తాను ఢిల్లీ వెళ్లాక అది మీ అందరికీ తెలుస్తుందన్నాడు. 20వ తేదీన చివరిసారిగా తన ప్రాణ స్నేహితుడు రవీందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి, తాను పార్లమెంటు ముందున్నానని చెప్పాడు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమానికి జరుగుతున్న ద్రోహాన్ని వివరిస్తూ లేఖ రాశాడు. అంతే.. పార్లమెంటు భవనం ముందే ఉరివేసుకుని అమరుడయ్యాడు. దేశమంతా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. తెలంగాణ మొత్తం బోరుమంది. ఆ ‘యాది’ అప్పుడే ఏడాది పూర్తయింది. కానీ, మన ‘యాది’ ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. యాదిరెడ్డి లక్ష్యం నెరవేర లేదు. తన మృతితో పార్లమెంటు చట్టాలు చేసే వారికి తెలంగాణ ఆవశ్యకతపై కనువిప్పు కలుగాలని భావించిన ఆ ‘యాది’ ఆశ నెరవేరలేదు. కానీ, యాదిరెడ్డి మరణం వృథా కాలేదు. ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. ఎంతో మందికి ఉద్యమ ఆవశ్యకతను తెలియజెప్పిన యాదిరెడ్డికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే, తెలంగాణ సాధన కోసం మరింత ఉద్యమించాలి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలి. అదే మనం ఆ ‘ఆమరుడి’కి అందించే ఘన నివాళి.