మర్లబడ్డ బూరుగుపల్లి

కరీంనగర్‌, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :రెండు కళ్ల బాబుకు బూరుగుపల్లి గ్రామ ప్రజలు మర్లబడ్డరు. తెలంగాణపై నీ పార్టీ తీరేందో చెప్పాలంటూ పట్టుబట్టారు. సీమాంధ్రలో నీ పార్టీ బతికి బట్టకట్టాలని మా బిడ్డలను ఎందుకు పొట్టన బెట్టుకుం టావ్‌ అంటూ నిలదీశారు. వస్తున్నా మీ కోసంపాదయాత్రలో భాగంగా గురువారం గంగాధర మండలం బూరుగుపల్లికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంపై వైఖరి తెలపాలంటూ నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, చంద్రదండు తెలంగాణవాదులపై దాడులకు తెగబడ్డాయి. తమ ఆకాంక్షకు జవాబు చెప్పాలంటూ అడిగిన పాపానికి ఉరికిస్తూ వెంటబడి మరీ చితకబాదారు. దీంతో బూరుగుపల్లి రణరంగంలా మారింది. జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. టీడీపీ కార్యకర్తలు తెలంగాణవాదులపై రాళ్లు రువ్వారు. చేతికి దొరికిన కర్రలు, ముళ్ల కంపలతో దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు తెలంగాణవాదులకు గాయాలయ్యాయి. గ్రామం మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టి కనిపించిన వారినల్లా అదుపులోకి తీసుకుని బాబుయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తనకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం రెండు కళ్లని, ఎవరి పక్షాన నిలబడాలో చెప్పాలని అడగడం సరికాదని అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

బాబు వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడ్డారు. రెండు ప్రాంతాలు ముఖ్యమని చెప్పే బాబు తీరు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. వందలాది మంది విద్యార్థులు, యువకులు బాబు రెండు కళ్ల విధానంతో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆయన తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించేలా ఈ ప్రాంతం నాయకులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో బాబు యాత్రను కొనసాగనివ్వబోమని హెచ్చరించారు.