మర్లవడ్డ మల్లన్న సాగర్‌

CAA

– భూ సేకరణ జీవోపై సర్కారు వెనుకడుగు

హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి): మెదక్‌ జిల్లా గజ్వెల్‌ పరిధిలో చేపట్టనున్న  మల్లన్న సాగర్‌ వివాదంపై దిద్దుబాటు చర్యలకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. వివాదాస్పదమైన జీవో 123ను రద్దుచేసి, 2013 భూసేకరణ చట్ట ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భావిస్తోంది. తద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చాలని యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. అలాగే భూసేకరణను జీవో ద్వారా చేపట్టడాన్ని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా తప్పుపట్టారు. చట్టాన్ని కాదని జీవోతో నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. రాజకీయంగా వ్యవహారం వేడెక్కుతుండటంతో సర్కారు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇన్నాళ్లు నిశ్శబ్ధంగా ఉన్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మల్లన్నసాగర్‌ అంశంలో ఏకమై ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు 123 జీవోను కోర్టులో సవాలు చేసేందుకు జేఏసీ ఏర్పాట్లు చేస్తుండటంతో..ఈ వివాదానికి చెక్‌పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రైతుల డిమాండ్‌ మేరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమని ప్రకటించేందుకు రెడీ అయింది. అయితే 50 టీఎంసీల నుంచి కొంతమేర రిజర్వాయర్‌ కెపాసిటీ తగ్గించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం సూతప్రాయంగా నిర్ణయం తీసుకుంటే , తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2013 చట్టప్రకారం పరిహారం కన్నా, 123 జీవో ప్రకారమే రైతులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం అంటోంది. దీనివల్ల రైతలు ఏళ్లతరబడి తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొంటోంది. అయినా రైతులు ఒప్పుకోకుంటే, భూసేకరణ చట్ట ప్రకారమే నష్టపరిహారం చెల్లించేందుకు సంసిద్థతను వ్యక్తం చేస్తోంది. రైతుల నుంచి వ్యక్తమయ్యే స్పందనను బట్టి ముందుకెళ్లాలని రెవెన్యూ, జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఇప్పటివరకు రెండు దశల్లో గ్రామస్థులతో చర్చలు జరిపిన అధికారులు, దేని ప్రకారం పరిహారం కావాలో తేల్చుకోవాలని గ్రామస్థులకే వదిలేశారు.ఇన్నాళ్లు కొత్త జీవో ప్రకారం పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం …తమ ఆందోళనతో వెనక్కితగ్గడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు, ఇళ్లు కోల్పోయినా..మల్లన్న సాగర్‌ రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగకరంగా ఉండాలని కోరుతున్నారు. అలాగే తమకునష్టం జరగని రీతిలో ప్యాకేజీ ఉండాలని కోరుతున్నారు.  ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలు నిర్మాణం చేపట్టేముందు వాటి విధివిధానాలు ప్రజలకు వివరించాల్సి ఉంటుందని డిసిసి అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బాధితుల పక్షాన కాంగ్రెసు పోరాటం చేస్తుందన్నారు. జలాశయాల నిర్మాణాలగాను నిర్వహిస్తున్న భూసేకరణలో 2013 చట్టాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. సాగర్‌లో ముంపునకు గురికానున్న 14 గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్‌ న్యాయపోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.