మళ్లీ గ్యాస్‌ గుదిబండ..


` రాయితీ, రాయితీయేతర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.15 పెంపు
దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. రాయితీ, రాయితీయేతర ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.15 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరను నేటి నుంచే అమలు చేస్తున్నట్లు వెల్లడిరచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 14.2కేజీల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.899.50కి చేరింది.
కాగా.. గత రెండు నెలల వ్యవధిలో వంటగ్యాస్‌ ధరను పెంచడం ఇది నాలుగో సారి. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ, 15వ తేదీన గ్యాస్‌ ధరలను చమురు సంస్థలు సవిూక్షిస్తాయి. అయితే అక్టోబరు ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్‌ ధరలను పెంచగా.. కొంచెం ఆలస్యంగా వంట గ్యాస్‌ ధరలను సవరించాయి. ఇక 2021లో వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 205 పెరగడం గమనార్హం.
అటు దేశంలో ఇంధన ధరలు కూడా దద్దరిల్లుతున్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరగడంతో కొత్త గరిష్ఠాలను చేరాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 102.94, డీజిల్‌ ధర రూ.91.42కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.96, డీజిల్‌ ధర రూ.99.17గా ఉంది.