మళ్లీ చర్చలకు సిద్ధం: కేంద్రం
– కేంద్రం ప్రతిపాదనలను అన్నదాతలు పరిశీలించాలి
– వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్
దిల్లీ,డిసెంబరు 10 (జనంసాక్షి): రైతులు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరించిన అన్నదాతలు.. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ నేడు కీలక ప్రసంగం చేశారు. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్న కేంద్రమంత్రి తెలిపారు. ‘గత సెషన్లో ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. చర్చల తర్వాతే లోక్సభ, రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాయి. మండీల నుంచి విముక్తి కల్పించి రైతులకు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించేందుకే కొత్త చట్టాలను తీసుకొచ్చాం. ఇప్పుడు రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా, ఎంత ధరకైనా విక్రయించుకోవచ్చు’ అని తోమర్ చెప్పారు. చట్టాలతో రైతుల భూములకు సంపూర్ణ భద్రత ఉంటుందని వ్యవసాయ మంత్రి అన్నారు. ‘రైతుల భూములను పారిశ్రామికవేత్తలు ఆక్రమిస్తారనే వదంతలు వినిపిస్తున్నాయి. ఒప్పంద వ్యవసాయం కొత్తదేవిూ కాదు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, కర్ణాటకలో గత కొన్నేళ్లుగా ఇది కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు. రైతుల భూముల లీజు, ఒప్పందాలపై కొత్త చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవు’ అని తోమర్ తెలిపారు. కొత్త చట్టాలను యావత్ దేశం స్వాగతించినప్పటికీ కొందరు రైతులు, కొన్ని రైతు సంఘాలు ఉద్యమ బాట పట్టాయని చెప్పారు. ఓ వైపు పంజాబ్ రైతులతో చర్చలు జరుగుతుండగానే ఆందోళనకు దిగారన్నారు. ‘అన్నదాతలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. కొత్త చట్టాల్లో సమస్య ఎక్కడుందో చెబితే వాటిని పరిష్కరిస్తాం. అన్నదాతల సందేహాలు తీరుస్తాం. ఇందులో మాకు ఎలాంటి అహం లేదు. ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చలు జరిపాం. రైతులు తమ సలహాలు ఇవ్వాలని, వాటిని పరిశీలిస్తామన్నాం. కానీ డిసెంబరు 8 తర్వాత వారి నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. అప్పటికీ కేంద్రం ప్రతిపాదనలు పంపింది. వాటిని రైతులు తిరస్కరించారు. చట్టాల రద్దుకు రైతులు పట్టుబట్టారు. సమస్యలపై ఎలాంటి దాపరికాలు లేకుండా చర్చించేందుకు మేం సిద్ధమే’ అని తోమర్ చెప్పుకొచ్చారు. ఏపీఎంసీలు, కనీస మద్దతు ధరపై కొత్త చట్టాల ప్రభావం ఏవిూ ఉండదని, ఈ విషయాన్ని రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రమంత్రి తోమర్ తెలిపారు. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హావిూ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతులు మరోసారి పరిశీలించాలని కోరారు. అన్నదాతలు ఎప్పుడు కోరితే అప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి భరోసా ఇచ్చారు. ఓవైపు కొవిడ్ పరిస్థితులు, మరోవైపు విపరీతమైన చలిలో అన్నదాతలు నిరసనలు చేయడం ఆందోళన కలిగిస్తోందని తోమర్ అన్నారు.