మహా ఒప్పందంకు కేబినెట్‌ ఆమోదం

C

– ప్రాజెక్టుల రీడిజైన్‌, సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌

– పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం

హైదరాబాద్‌,జూన్‌ 3(జనంసాక్షి):  రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ ప్రక్రియకు తెలంగాణ మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 19 ప్యాకేజీల్లో మార్పులు చేర్పులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బ్యారేజీలపై మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా కేబినేట్‌లో ఆమోదించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ వివిధ అంశాలపై చర్చించింది.  సుమారు మూడు గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైన్‌కు మంత్రివర్గం ఆమోదించింది. ప్రాజెక్టుల రీడిజైన్‌పై కేబినెట్‌ సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల పునరాకృతికి మంత్రివర్గం ఆమోదించింది. కంతనపల్లి, సీతారామ, భక్తరామదాసు, రాజీవ్‌ సాగర్‌, ఇందిరా సాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్పీ వరద వరద కాలువ రీడిజైన్‌ పనులకు ఆమోదం తెలిపింది. మొత్తం 19 ప్యాకేజీల్లో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలను కేబినెట్‌ ఆమోదించింది. అసైన్డ్‌ భూములు, కమతాల ఏకీకరణకు కొత్త విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. భూముల క్రమబద్దీకరణ, నిరుపయోగ భూముల వినియోగానికి విధానం రూపొందించాలని ఆదేశించింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు వ్యూహం రూపొందించాలని సీఎం సూచించారు. శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు సూచనలు చేశారు. కల్తీ నిరోధానికి

తీసుకోవాల్సిన చర్యలు సిఫారసు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఫిషరీస్‌ సైన్స్‌ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మత్స్యసంపద పెంపుపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. వరంగల్‌ లో అగ్రికల్చర్‌ కళాశాల, మామునూరులో వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మైక్రో ఇరిగేషన్‌ ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రూ. వెయ్యి కోట్ల నాబార్డ్‌ రుణానికి పూచీకత్తుగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మెదక్‌ లో నిమ్జ్‌, హైదరాబాద్‌ లో ఫార్మానిమ్జ్‌ కోసం టీఎస్‌ఐఐసీ రూ. 784 కోట్ల హడ్కో రుణం పొందడానికి గ్యారంటీ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అర్చకుల జీతాలు చెల్లించేందుకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కానుంది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆధ్వర్యంలో మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు కానుంది. దేవాలయాల ఆదాయం, భూములు, ఆక్రమణల నియంత్రణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది. హుండీ ఆదాయ దుర్వినియోగంపై ఉపసంఘం నివేదిక తయారు చేయనుంది. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కమిటీ కృషి చేయనుంది. దేవాదాయ, ధర్మాదాయ, ధార్మిక సంస్థల్లో ట్రస్ట్‌ మెంబర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. రూ. కోటి ఆదాయం దాటిన సంస్థల్లో సభ్యుల సంఖ్య 9 నుంచి 14కు పెంపునకు నిర్ణయం తీసుకుంది.