మహిళపై యాసిడ్‌తో దాడి..

విజయవాడ, జూలై 27 : అనుమానంతో భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. గన్నవరం మండలం, శీకవరం గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. షాలినిపై ఆమె భర్త సైదా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. భార్య శీలంపై అనుమానంతో భర్త సైదా ఆమెను వేధిస్తుండేవాడని బంధువులు, స్థానికులు చెప్పారు. గురువారం సాయంత్రం సైదా ఇంటికి వచ్చేసరికి ఒక బంధువుతో భార్య షాలిని మాట్లాడడాన్ని చూసిన సైదా శుక్రవారం తెల్లవారుఝామున నిద్రలో ఉన్న భార్యపై యాసిడ్‌ పోసి పరారయ్యాడు. ఆమె కేకలకు వచ్చిన ఇరుగు పొరుగు 108కి సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. సైదా కోసం పోలీసులు గాలిస్తున్నారు.