ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : సోమిరెడ్డి

నెల్లూరు, జూలై 20: రాష్ట్ర ప్రజలకు సరిగా విద్యుత్‌ సరఫరా చేయలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నెల్లూరులో శుక్రవారం నాడు వేలాది మంది కార్యకర్తలతో జరిగిన విద్యుత్‌ భవన్‌ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ సరఫరా విషయంలో ద్వంద్వ విధానాలను పాటిస్తున్నారని అన్నారు. 24గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలంటే ప్రజలు 5వేల కోట్ల రూపాయల సర్‌ఛార్జీ భారాన్ని మోయకతప్పదని అనడం ఒక రకంగా ప్రజలను బెదిరించడమేనని అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి విద్యుత్‌ను తీసుకురాలేని ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కొనసాగాలని ఆయన అన్నారు. త్వరలో జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుండగా విద్యుత్‌ సరఫరా పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు కోట్ల రూపాయల పంట నష్టం చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే మస్తాన్‌రావు, గుడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.