ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌ ఘట్టం

ఆదివారం లెక్కింపు అదే రోజు ఫలితం
హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పోలింగ్‌లో 193మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 193మందిలో 190మంది ఎమ్మెల్యేలు కాగా.. మిగిలిన ముగ్గురు ఎంపీలు. రాష్ట్రానికి చెందిన 60మంది ఎంపీలలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్‌ జగన్‌, మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి తమ ఓటు హక్కును నగరంలో వినియోగించుకోగా మిగిలిన వారు న్యూఢిల్లీలో ఓటు వేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల్లో ఓటు వేసిన వారి వివరాలు పార్టీల వారీగా ఇలా ఉన్నాయి. కాంగ్రెస్‌-156, టీడీపీ-5, వైఎస్‌ఆర్‌సిపి-17, ఎంఐఎం 7, బిజెపి 2, లోక్‌సత్తా-1, సిపిఎం-1, ఇండిపెండెంట్లు ఒకరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 190మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 104మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనర్హత ఓటు కారణంగా సుమన్‌ రాథోడ్‌ ఓటు వేయలేదు. రాష్ట్ర శాసనసభలో మొత్తం 294మంది సభ్యులు అన్న విషయం తెలిసిందే. బ్యాలెట్‌ బాక్సులను శుక్రవారం రెండు విమానాల్లో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణానికి తరలించనున్నారు. ఆదివారం ఉదయం లెక్కింపు ప్రారంభమవుతుంది. అదేరోజు ఫలితం వెలువడనుంది. పోలింగ్‌ ప్రారంభం ఇలా.. అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ గురువారం ఉదయం 10.02గంటలకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తొలి ఓటుతో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. లోక్‌సత్తా అధినేత, ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణ రెండో ఓటు వేశారు. తొలి అరగంటలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డికె అరుణ, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, వైకాప ఎమ్మెల్యే బాలరాజు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రత్యేక ఎస్కార్టు నడుమ చంచల్‌గూడ జైలు నుంచి వైఎస్‌ జగన్‌, మాజీ మంత్రి మోపిదేవిలను కొద్ది నిమిషాల తేడాతో విడివిడిగా అసెంబ్లీ ప్రాంగణానికి తరలించారు. వేర్వేరు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో చంచల్‌గూడ జైలు నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి ప్రత్యేక ఎస్కార్టు మధ్య తీసుకువచ్చారు. వారిరువురు కేవలం 10 నుంచి 12 నిమిషాల మధ్యే ఓటు హక్కు వినియోగించుకోవడం..అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు వెళ్లిపోవడం చకాచకా జరిగిపోయాయి. అలాగే ముగ్గురు ఎంపిలు రాష్ట్రంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్‌ జగన్‌, నేదురుమల్లి జనార్దనరెడ్డి, మేకపాటి ఓటు వేశారు. అసెంబ్లీ వెలుపల భారీ భద్రత కల్పించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లోపలికి పంపుతున్నారు. టీడీపీ, టిఆర్‌ఎస్‌, సిపిఐ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు.
ఆ ఐదుగురి ఓటింగ్‌పై..
టీడీపీకి చెందిన ఐదుగురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు తెలిసింది. మరో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై అనర్హత పిటిషన్‌ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఇటీవలె పార్టీ సస్పెన్షణ్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పార్టీపై, అధినేతపై అసంతృప్తితో ఉన్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఓటింగ్‌కు పాల్పడి ఉండవచ్చన్న ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామం పట్ల టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.