మూడు ప్రాంతాల్లోను ఇఫ్తార్‌ విందు : టీడీపీ

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం సందర్భంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఇఫ్తార్‌ విందులు నిర్వహించాలని మంగళవారంనాడు టీడీపీ మైనారిటీ సాధికార కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మైనారిటీ సాధికారిత కమిటీపై ఉందన్నారు. హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడలలో జరగనున్న ఇఫ్తార్‌ విందులకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కానున్నట్టు లాల్‌జాన్‌బాషా తెలిపారు. కమిటీ కన్వీనర్‌ లాల్‌జాన్‌బాషా, జాహెద్‌ ఆలీఖాన్‌, ఎన్‌ఎండి ఫరూక్‌, సయ్యద్‌ యూసఫ్‌ ఆలీ, అబ్దుల్‌ ఘనీ, మహ్మద్‌ సలీం, ఎంఎ షరీఫ్‌, తదితరులు పాల్గొన్నారు.