మేడారం చినజాతరలో భక్తుల సందడి

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్నజాతరకు మరో నాలుగు రోజుల గడువు ఉండగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రోజూ పెద్దఎత్తున వచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మ గ్దదెలను దర్శించుకొని మొక్కులు సమర్పించారు. దీంతో మేడారం పరిసరాలన్నీ జాతర కళను సంతరించుకున్నాయి. సంప్రదాయంగా మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. ఎత్తు బంగారం, యాటలు, పసుపు కుంకుమలు, ఒడిబియ్యంతో తల్లుల దర్శనానికి వచ్చారు. గద్దెల వద్ద సాష్టాంగపడి వనదేవతలకు మొక్కిన ముడుపులను కట్టి పూజలు చేశారు. అనంతరం పరిసరాల్లోని పంట పొలాలు, అటవీ ప్రాంతంలో విడిది చేసి విందుభోజనాలు ఆరగించారు. మేడారంలో పసుపు కుంకుమలు, గాజులకు ప్రత్యేక స్థానం ఉండటంతో స్థానిక దుకాణాల్లో వీటిని ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.