మైనార్టీల సంక్షేమానికి 27న ఎన్టీఆర్‌ భవన్‌లో సదస్సు

హైదరాబాద్‌: మైనార్టీల సంక్షేమానికి ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు, మైనార్టీ డిక్లరేషన్‌ రూపకల్పనకు ఈ నెల 27న తెలుగుదేశం మైనార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే ఈ సదస్సుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతారు. 26న మైనార్టీ మత పెద్దలు, మేధావులతో రాజకీయాలకు అతీతంగా ఒక సమావేశం నిర్వహించి, ఈ వర్గం సంక్షేమం కోసం ఏం చేయాలన్న దానిపై సూచనలు తీసుకుంటారు. తెలుగుదేశం మాజీ ఎంపీ లాల్‌జాన్‌ భాషా, మాజీ మంత్రి ఎస్‌ఎండీ ఫరూక్‌, రాష్ట్ర నేత షరీఫ్‌, ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, సిటీ మైనార్టీ విభాగం నేత షాబాజ్‌లు సోమవారమిక్కడ ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 93 శాతం మైనార్టీ జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో కంటే రాష్ట్రంలోని ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని బాషా అన్నారు.  రిజర్వేషన్లు 50 శాతం దాటితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చని, ఆ ఇబ్బంది రాకుండా తొలుత మూడు శాతం ప్రకటిస్తే మొత్తం రిజర్వేషన్లు 49 శాతం అవుతాయని, అధికారంలోకి వచ్చాక అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి పెంచుకొవచ్చని చంద్రబాబు భావించారన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రకటిస్తే కాంగ్రెస్‌ కాపీ కొట్టిందన్నారు. 33 ఇంజనీరింగ్‌ కళాశాలలు మైనార్టీలకు ఇచ్చిన ఘనత తెదేపాదేనని చెప్పారు. ముస్లింలకు విద్యా రంగంలో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పలు కమిషన్‌లు సిఫార్సు చేశాయని, వాటిపైనా తెలుగుదేశం ఆలోచిస్తుందని ప్రకటించారు.