మొక్కలు పెంచాలి : కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 10 : మొక్కలు నాటేందుకు నర్సరీల నుండి మొక్కలను జిల్లాలోని 503 పాఠశాలలకు చేరేవేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఒకేరోజు 10లక్షల మొక్కలు నాటే కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వన చైతన్య యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లాలో ఒకే రోజు రెండు లక్షల మంది విద్యార్థులచే 10 లక్షల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దీనికి అవసరమైన మొక్కలన్నింటికి జిల్లాలోని 503 పాఠశాలలకు చేరేవేసే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం కావటానికి అధికారులు, స్థానిక నాయకులను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ అడ్వయిజరీ, మాజీ ఐఎఎన్‌ అధికారి బాపురెడ్డి, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహార్‌లాల్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆశీర్వాదం, జిల్లా విద్యాధికారి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.