మోసకారి.. కెసిఆర్..!

మంథని, (జనంసాక్షి) : మోసకారి కేసీఆర్ అని.. బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో పోటు పొడిచి అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. మంగళవారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. 2014లో దళితుడిని సీఎం చేస్తానని మూడెకరాల భూమి ఇస్తానని నమ్మించి ఓట్లు దండుకొని కెసిఆర్ దళితులను నట్టేట ముంచాడని అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టాలని కోరారు. బిఆర్ఎస్, బిజెపి తోడుదొంగలు అని కవిత లిక్కర్ స్కాం లో అడ్డంగా దొరికిన అరెస్టు చేయలేదని, అలాగే సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి చేసిన ఎలాంటి విచారణ చేపట్టడం లేదన్నారు. తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ ..కెసిఆర్ అవినీతిపై విచారణ జరుపుతామని జైల్లో పెడతామని పదేపదే మాట్లాడడమే తప్ప విచారణ చేపట్టింది లేదు.. జైల్లో పెట్టింది లేదని అన్నారు. రాష్ట్రంలో పట్టుమని పది స్థానాలు సైతం గెలిచే సత్తా లేని బిజెపి పార్టీ సీఎం చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మరో మారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను సీఎం చేయడం కోసం మోడీ బిజెపి పార్టీ కెసిఆర్ కు వెనుక నుండి అండగా నిలుస్తున్నదని ఆరోపించారు.రాష్ట్రంలో పట్టుమని పది స్థానాలు సైతం గెలిచే సత్తా లేని బిజెపి పార్టీ బిసి సీఎం చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ ఓట్లను చీల్చి మరో మారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా మోడీ, బిజెపి పార్టీ కెసిఆర్ కు వెనుక నుండి అండగా నిలుస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అని హామీలు ఇస్తే అమలు చేసి తీరుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేసి పేదల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి సౌమ్యుడు, అభివృద్ధికి మారుపేరు గా పేరొందిన శ్రీధర్ బాబును మంథని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.