యూనివర్సిటీ చట్టాల మార్పు అవసరం

C
– హరితహారాన్ని  పకడ్బందీగా అమలు చేయాలి

-ముఖ్యంత్రి కేసీఆర్‌ సమీక్ష

– ఇంద్రానగర్‌లో సీఎం పర్యటన

– డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి హామీ

హైదరాబాద్‌,జులై21(జనంసాక్షి):

యూనివర్సిటీ చట్టాల్లో మార్పులు తీసుకుని వచ్చి, విసిల నియామకాల్లో ప్రభుత్వానికే అధికారం ఉండేలా చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల పాలన వ్యవస్థను గాడిన పెట్టాల్సి ఉందన్నారు.  క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలోని యూనివర్సిటీలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు, సిఎస్‌ రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తదితరులతో సవిూక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా విశ్వవిద్యాలయ చట్టాలు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయాలకు ఒకే వ్యక్తి వీసీగా ఉంటే పర్యవేక్షణ కష్టమవుతోందన్నారు. విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతకు అనుగుణంగా నిపుణుల నియామకం చేపట్టాలన్నారు. వీసీ నియామక అధికారం ప్రభుత్వానికి ఉండాలన్నారు. వీసీలు, రిజిస్ట్రార్‌ల నియామకల మార్గదర్శకాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా విశ్వవిద్యాలయ చట్టాలు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధాన్యతకు అనుగుణంగా నిపుణులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. వీసీలు, రిజిస్ట్రార్‌ల నియామకానికి అవసరమైన మార్గదర్శకాలను రూపకల్పన చేయనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదయ్యను సీఎం నియమించారు. యూనివర్సిటీల్లో వైస్‌ చాన్సలర్ల నియామకంపై సెర్చ్‌

కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు కమిటీ నియామకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆమోదం తెలిపారు. అదేవిధంగా జెఎన్టీయూ వీసీగా ప్రొ. యాదయ్య నియామకానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వర్శిటీలకు కొత్త చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

కండ్లకోయలో హరితహారం పరిశీలన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం కండ్లకోయ నుంచి గుర్రంగూడ వరకు బస్సులో ప్రయాణించారు. అధికారులతో కలిసి ఆయన ఔటర్‌ రింగ్‌రోడ్‌ యాత్రకు బయలుదేరారు. ఈ ప్రయాణంలో హరితహారం కార్యక్రమంపై కేసీఆర్‌ సవిూక్షించారు. కండ్లకోయ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ప్లాంటేషన్‌ను సీఎం పరిశీలించారు. సీఎం వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

హైదరాబాద్‌ కు హరితహారం కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా, పకడ్బంధీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. నగరం చుట్టూ వున్న ఔటర్‌ రింగు రోడ్డుకు ఇరువైపులా అందమైన చెట్లు పెంచితే హైదరాబాద్‌ నగరానికి హరితహారం అవుతుందన్నారు. మేడ్చల్‌ దగ్గరలోని కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్‌, నాగార్జున సాగర్‌ రోడ్‌, విజయవాడ రోడ్‌, ఘట్‌ కేసర్‌ వరకు ఔటర్‌ రింగురోడ్డుపై అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో ముఖ్యమంత్రి పర్యటించారు.

కండ్లకోయ, మేడ్చల్‌, మజీద్‌ గడ్డ, నాదర్‌ గుల్‌, గండిగూడ, మాదన్నగూడ, తుర్కయాంజల్‌, గుర్రంగూడ, శ్రీనగర్‌, మంగళ్‌ కాలనీ, అంబర్‌ పేట, హయత్‌ నగర్‌, బాచారం, నారపల్లి ప్రాంతాల్లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వీటిలోని చెట్లను రక్షించాలని, రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాలని సూచించారు. రిజర్వ్‌ ఫారెస్టులలో కూడా ఇంకా ఖాళీ జాగాలున్నాయని, అక్కడ కూడా మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ఓఆర్‌ఆర్‌ కు రెండు వైపులా విరివిగా మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ వెంట చాలా స్థలం వున్నందున, దానిని బాగా వుపయోగించుకుని చెట్లు పెంచాలని వివరించారు.

ఘట్‌ కేసర్‌ దగ్గర 10 లక్షల మొక్కలు పెంచుతున్న నర్సరీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ ఏడాదికే కాకుండా వచ్చే ఏడాదికి సరిపోయే మొక్కలు కూడా పెంచాలన్నారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే పూల మొక్కలు బాగా పెంచాలని సూచించారు.

ఓఆర్‌ఆర్‌ పై పర్యటన తర్వాత సీఎం కేసీఆర్‌ సవిూక్ష జరిపారు. వరంగల్‌ హైవే, రాజీవ్‌ రహదారి, మేడ్చల్‌ హైవే, ముంబై హైవే, గండి మైసమ్మ రోడ్‌, నర్సాపూర్‌-మెదక్‌ రోడ్‌, వికారాబాద్‌ హైవే, ఓల్డ్‌ ముంబై హైవే, చేవెళ్ల రోడ్‌, నార్సింగి రోడ్‌, బెంగళూరు హైవే, శ్రీశైలం రోడ్‌, నాగార్జున సాగర్‌ రోడ్‌, విజయవాడ రోడ్ల వెంట వున్న భూముల్లో మొక్కలు నాటాలని అధికారులకు చెప్పారు.

వచ్చి పోయే వారితో కలుపుకుని హైదరాబాద్‌ జనాభా కోటి వరకు ఉంటుందని, ప్రతి ఏటా కనీసం పది శాతం పెరుగుతున్నదని సీఎం కేసీఆర్‌ వివరించారు. ఈ జనాభాకు తగినట్లుగా లంగ్‌ స్పేస్‌ లను సిద్ధం చేయాలని, భావితరాల కోసం నగరాన్ని చెట్లతో నింపాలన్నారు. నగరంలోని వివిధ ఫారెస్ట్‌ బ్లాక్‌ ల కింద లక్షా 50 వేల ఎకరాల భూమి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడాలని అటవీ అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో భూమి విలువ నానాటికి పెరుగుతున్నందున, అటవీ భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీన్ని అరికట్టాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి వెంట హెచ్‌ఎండీఏ కమిషనర్‌ శాలినీ మిశ్రా, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌, అటవీ శాఖ కార్యదర్శి తివారి, పిసిసిఎఫ్‌ మిశ్రా, రంగారెడ్డి కలెక్టర్‌ రఘునందన్‌ రావు, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ సిఎఫ్‌ నాగభూషణం, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, రంగారెడ్డి జెసి రజత్‌ కుమార్‌ వున్నారు.

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ లోని బస్తీల్లో పర్యటిస్తున్నారు. సనత్‌ నగర్‌, కూకట్‌ పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఇందిరానగర్‌ ని ముఖ్యమంత్రి సందర్శించారు. రోడ్లు, ఇండ్లను పరిశీలించారు. బస్తీలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరానగర్‌ వాసులకు జీ ప్లస్‌ 2 పద్ధతిలో ఇండ్లు కట్టించి ఇస్తామని, లే అవుట్‌ నమూనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హెచ్‌.పి.ఎస్‌ ఎదురుగా ముస్లింలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హావిూ ఇచ్చారు. హైదరాబాద్‌ లోని బస్తీల్లో రెండు లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని, వారందరికి దశలవారీగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, ఉన్నతాధికారులు ఉన్నారు.