యూపి ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు
ఎన్నికల తరవాత మళ్లీ చట్టాలు యధాతథంగా ఉంటాయి
ప్రధాని నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేశ్
లక్నో,నవంబర్19 (జనం సాక్షి ) :
యూపీ సహా పలు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసిందని, ఎన్నికల తర్వాత మళ్లీ నల్లచట్టాలను తీసుకువస్తారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రైతులపై ప్రేమతో బీజేపీ సాగు చట్టాలను వెనక్కితీసుకోలేదని కాషాయ పార్టీ రైతులను మోసగిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ హృదయం పరిశుభ్రమైనది కాదని, సంపన్నుల కోసం పనిచేసే ఆ పార్టీ భూసేకరణ, నల్ల చట్టాలతో రైతులను దగా చేసేందుకు ప్రయత్ని స్తోందని అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. రైతులను అవమానిస్తూ వారిని కార్లతో తొక్కించిన బీజేపీ పూర్వాంచల్‌లో ఎస్పీ విజయ్ యాత్రకు లభించిన ప్రజల మద్దతు చూసి బెంబేలెత్తి సాగు చట్టాలను రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. వందలాది రైతుల మృతికి కారణమైన దోషులను ఎప్పుడు శిక్షిస్తారో బీజేపీ ప్రజలకు బదులివ్వాలని అఖిలేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై యూపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో వెల్లడిరచాలని నిలదీశారు. ప్రధాని మోదీ యూపీలో శుక్రవారం పర్యటిస్తున్న ప్రాంతంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు వెలుగుచూశాయని అన్నారు. ఇక వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు వెనక బీజేపీ ఉద్దేశాన్ని కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. కీలక రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగు చట్టాలను రద్దు చేశారని ఆ పార్టీ ఆరోపించింది.