యూరప్‌లో కోవిడ్ ఉధృతి..
` వారంలో 20 లక్షల కేసులు!
జెనీవా,నవంబరు 14(జనంసాక్షి):కొన్నాళ్లుగా భారీ సంఖ్యలో కొవిడ్ కేసులతో యూరప్ అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే! గత వారం వ్యవధిలో యూరప్‌వ్యాప్తంగా దాదాపు 20 లక్షల కేసులు నమోదయ్యాయని, మహమ్మారి వ్యాప్తి మొదలు ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వ్యవధిలో దాదాపు 27 వేల మరణాలు సంభవించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాలను లెక్కిస్తే.. సగానికి పైగా ఇక్కడే నమోదైనట్లు పేర్కొంది. యూరప్‌లో తాజా పరిణామాలపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ సైతం స్పందించారు. జెనీవాలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ ఐరోపాలో వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉన్న ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.‘ఇది మరొక హెచ్చరిక. మేం పదేపదే చెబుతున్నట్లుగా.. కేవలం టీకాలతోనే కొవిడ్ కట్టడి సాధ్యం కాదు’ అని టెడ్రోస్ గుర్తుచేశారు. ఆసుపత్రిలో చేరే పరిస్థితులు, మరణం సంభవించే అవకాశాలను మాత్రమే ఇవి తగ్గిస్తాయని.. కానీ, వైరస్ వ్యాప్తిని నిరోధించలేవని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున కరోనా పరీక్షల నిర్వహణ, మాస్కుల వినియోగం, వ్యక్తిగత దూరం, మెరుగైన వెంటిలేషన్ తదితర చర్యలు కొనసాగించాలని చెప్పారు. వీటితోనే.. వైరస్ కట్టడి, సాధారణ కార్యకలాపాల నిర్వహణ మధ్య బ్యాలెన్స్ సాధ్యమవుతుందని వివరించారు. బూస్టర్ డోసు విషయంలోనూ టెడ్రోస్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఇంకా తొలి డోసు కోసం ఎదురుచూస్తునే ఉన్నారని.. వారిని వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు, పిల్లలకు టీకా వేయడంలో అర్థం లేదని విమర్శించారు