యూరోపియన్‌ యూనియన్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం

ఒస్లో,  : యూరోప్‌లో శాంతియుత వాతావరణానికి, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. 1950 నుంచి సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోన్న ఐరోపాలో శాంతి పునరుద్దరణకు యూరోపియన్‌ యూనియన్‌ విశేషంగా కృషి చేస్తోంది. ఈయూ కృషిని గుర్తించిన నార్వే ప్రైజ్‌ కమిటీ నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐరోపాలో శాంతికి, ప్రజాస్వామ్య స్థాపనకు, మానవ హక్కుల పునరుద్ధరణకు  ఆరు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను యూరోపియన్‌ యూనియన్‌కు ఈ అవార్డు దక్కింది. యుద్ధం ముగిసిన తర్వాత శాంతి స్థాపనకు ఈయూ నిరంతరాయంగా, పాదర్శకంగా చేస్తున్న కృషికి గాను శాంతి అవార్డును ఇస్తున్నట్లు నోబెల్‌ కమిటీ చైర్మన్‌ తోర్బ్‌జెర్న్‌ జగ్లాండ్‌ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన ఆర్థిక ఒప్పందాల్లో భాగంగా శాశ్వత శత్రు దేశాలైన ఫ్రాన్స్‌, జెర్మనీల కలయికతో యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పాటైంది. దాదాపు 27 దేశాలు 500 మిలియన్ల జనాభాతో ఈయూ రూపాంతరం చెందింది. ఆ తర్వాత మరిన్ని దేశాలు కూడా ఈయూలో చేరేందుకు  వేచిచూస్తున్నాయి. నాటి ఫ్రెంచ్‌ విదేశాంగా శాఖ మంత్రి షుమాన్‌ ప్రతిపాదనల మేరకు మే 9, 1950న ఈయూ పురుడు పోసుకుంది. ఫ్రాన్స్‌, ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జెర్మనీ ఏకీకరణతో కొత్త సామ్రాజ్యం ఏర్పాటైంది. మిగతా ఐరోపా దేశాలు కూడా చేరేందుకు ఆసక్తి కనబరచడంతో ఈయూ పటిష్టవంతమైంది. ‘ఈ రోజు జెర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య యుద్ధాన్ని ఊహించలేదు. చారిత్రక శత్రువులు అత్యంత దగ్గరి భాగస్వాములయ్యారు. పరస్పర విశ్వాసం, నిరాయుధీకరణ వల్లే ఇది సాధ్యమైంది’ అని నోబెల్‌ కమిటీ అభిప్రాయపడింది.